ఆ జోరు అంతర్జాతీయ క్రికెట్‌లో కనబడదే?

Khawaja Good But Never Saw His Best In Internationals, Ponting - Sakshi

సిడ్నీ: ఇప‍్పటికే  జట్టులో చోటు కోల్పోయి తన కెరీర్‌పై డైలమాలో పడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజాపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ ఖవాజా నుంచి ఒక మంచి ప్రదర్శన చూడలేదన్నాడు. ఖవాజాలో నిలకడైన ప్రదర్శన లేకపోవడమే అతనిపై వేటుకు కారణమన్నాడు. ఇప్పటివరకూ ఖవాజా 44 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీల సాయంతో 1,554 పరుగులు చేయగా, టెస్టుల్లో 8 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలతో 2,887 పరుగులు చేశాడు.  అయితే ఈ తరహా ప‍్రదర్శన సరిపోదు అంటున్నాడు రెండుసార్లు వరల్డ్‌కప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గా రికీ పాంటింగ్‌. ఇక ఖవాజా మళ్లీ ఆసీస్‌ జట్టులో రీఎంట్రీపై పాంటింగ్‌ అనుమానం వ్యక్తం చేశాడు. (‘పీఎస్‌ఎల్‌లో కశ్మీర్‌ టీమ్‌ ఉండాలి’)

‘ ఖవాజాకు ఆసీస్‌ జట్టులో చోటు కష్టమే. నేను ఎప్పుడూ అతనొక మంచి ప్లేయర్‌ అని ఫీలవుతూ ఉండేవాడిని. కానీ నేను ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. ఏదో కొన్ని మెరుపులు తప్పితే నిలకడ మాత్రం ఖవాజాలో ఎక్కడా కనిపించలేదు. అతనిలో నిలకడ ఉంటే ఆసీస్‌ జట్టులో కొనసాగేవాడు. అది లేకపోవడం వల్లే జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో  ఖవాజా చేసిన పరుగులతో పోలిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా తక్కువ చేశాడు. దేశవాళీల్లో భారీ పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో తేలిపోతారు. మనం ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లమని రాసి ఉండదు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే గొప‍్పతనం ఉంటుంది. ఈ సీజన్‌ సమ్మర్‌ క్రికెట్‌ ఆరంభమైన తర్వాత  తిరిగి ఖవాజాకు అవకాశం వస్తుంది. అక్కడ నిరూపించుకుని మళ్లీ అవకాశం కోసం వేచి చూడాలి. ఒకవేళ మళ్లీ ఆడే  అవకాశం వస్తే అప్పుడైనా ఎవర్నీ నిరాశపరచడనే అనుకుంటున్నా’ అని పాంటింగ్‌ తెలిపాడు. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మధ్యలో  జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. దాంతో ఇటీవల సీఏ విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాలో ఖవాజాకు చోటు దక్కలేదు.  (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top