కశ్మీరీ క్రికెటర్ల తీరుపై తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. కశ్మీర్‌లో ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. కాకపోతే ఇక్కడ పాకిస్థాన్ జట్టు జెర్సీ ధరించిన ఆటగాళ్లు కశ్మీరీలు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కశ్మీరీ క్రికెటర్లు గ్రీన్ జెర్సీ ధరించడంతో పాటు పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. మరో జట్టు ఆటగాళ్లు తెల్లటి దుస్తులు ధరించారు.
గాండ్రెబల్ జిల్లాలోని వేయిల్ ప్లే గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కశ్మీరీ క్రికెటర్ల తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు. భారతీయులు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతో జీవిస్తూ, పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెనాని-నష్రీ టన్నెల్‌ను ప్రారంభించడానికి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు, ఇతర సందర్భాల్లో కశ్మీర్‌లో పాకిస్థానీ జెండాలు ప్రదర్శించిన సంఘటనలు ఉన్నాయి.