‘నా చివరి టీ20 వరల్డ్‌కప్‌ ఇదే కావచ్చు’

It could be the last World T20 for me, says Mithali Raj - Sakshi

గయానా:  మహిళల క్రికెట్‌లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా ఓపెనర్‌, స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. వెస్టిండీస్‌ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ తన చివరిది అవుతుండొచ్చని తెలియజేశారు. టీ20 అంటేనే ధనాధన్‌ ఆట అని, అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘జట్టులో చాలా మార్పులు వచ్చాయి, కొత్త ప్లేయర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఏర్పడింది. దేశం తరపున ఎంతకాలం ఆడామన్న దానికంటే.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే గొప్ప విషయం. నా బ్యాటింగ్‌ కంటే ఎక్కువగా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాను. యువ ప్లేయర్లు కుదురుకుని జట్టు సమతూకంగా ఉండడంతో ఇదే తనకు చివరి టీ20 వరల్డ్‌కప్‌ అయ్యే అవకాశం ఉంది’. అంటూ మిథాలీ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సీనియర్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే ఆ ఫార్మట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  

మిడిలార్డర్‌లో రావటంపై.. 
న్యూజిలాండ్‌ బలమైన జట్టు కావడంతో అనుభవం కలిగిన బ్యాటర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో ఉంటే జట్టుకు ఉపయోగమని భావించామని అందకే ఆ మ్యాచ్‌లో ఓపెనింగ్‌కు రాలేదని వివరించారు. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగడంతో ఓపెనర్‌గా వస్తేనే బెటర్‌ అనుకున్నామని పేర్కొన్నారు. ఇక తన బ్యాటింగ్‌ గురించి మాట్లాడుతూ, ప్లాన్‌కు ప్రకారమే ఆడితే కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది గనుక పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాలో, నెమ్మదిగా ఆడాలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీరాజ్‌ 56 పరుగులు (47 బంతుల్లో) చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top