‘ఆ టూర్‌ ఇష్టం లేదు.. కానీ లైఫ్‌ మారిపోయింది’

Irfan Pathan On Series With India U19 That Changed His Life - Sakshi

బంగ్లాతో వన్డేలో 9 వికెట్లతో చెలరేగిపోయాడు..

పాక్‌ గడ్డపై హ్యాట్రిక్‌ తీసిన తొలి భారత బౌలర్‌

న్యూఢిల్లీ: ఇటీవల టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బీసీసీఐ సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశాడు. బీసీసీఐ సెలక్టర్లు ఆటగాళ్ల కెరీర్‌ను అర్థాంతరంగా ముగించేస్తారంటూ మండిపడ్డాడు. ఇక్కడ 30 ఏళ్లకే వృద్ధుల్ని చేసే ఆనవాయితీ ఎప్పుట్నుంచో వస్తుందంటూ ధ్వజమెత్తాడు. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌లో ఆటగాళ్ల కెరీర్‌ కొన్ని సందర్భాల్లో 30 ఏళ్లకు ఆరంభమైతే, మనకు మాత్రం ఆ వయసుకు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితిని కల్పిస్తారని ఆరోపించాడు. మూడు పదుల వయసులోనే బుద్ధుడ్ని చేస్తారంటూ బీసీసీఐ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఇదిలా ఉంచితే, తన అంతర్జాతీయ కెరీర్‌కు తొలి పునాది పడింది మాత్రం 2003లో అంటున్నాడు. ఆ ఏడాది పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన అండర్‌-19 భారత జట్టులో తాను కూడా సభ్యుడిని కావడం తన కెరీర్‌ ఎదుగుదలకు దోహద పడిందన్నాడు. (బీసీసీఐ సెలక్టర్లపై ఇర్ఫాన్‌ తీవ్ర విమర్శలు)

అయితే ఆ పర్యటనకు వెళ్లడం తనకు తొలుత ఇష్టం లేదని, చాలా అసంతృప్తితో అక్కడికి వెళితే చాలా సంతృప్తిగా తిరిగి వచ్చానన్నాడు. లాహెర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించడంతో తన పేరు మార్మోగిపోయిందన్నాడు. ప్రత్యేకంగా స్వింగ్‌ బౌలర్‌గా తనకు పేరు వచ్చిన పర్యటన అదేనని ఇర్ఫాన్‌ తెలిపాడు. ‘ ఆ అండర్‌-19 పర్యటనకు వెళ్లడం ఇష్టం లేదు. మాకు ముంబైతో రంజీ మ్యాచ్‌ ఉంది. ఇదే విషయాన్ని మా రంజీ జట్టు యాజమాన్యానికి తెలిపా. నేను అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నా. నేను ముంబై రాణిస్తే నా పేరు చక్కర్లు కొడుతుందనే దానిపైనే దృష్టి పెట్టా. నాకు పాకిస్తాన్‌ టూర్‌ గురించి అస్సలు తెలియదు. నువ్వు అండర్‌-19 జట్టుతో పాక్‌ పర్యటనకు వెళ్లాల్సిందేనన‍్నారు. 14 ఏళ్లలో తొలిసారి పాక్‌కు వెళ్లా. చాలా నిరాశగానే అక్కడి అడుగుపెట్టా. కానీ అది నా తలరాతను మార్చుతుందని అనుకోలేదు.  అది అండర్‌-19 ఆసియాకప్‌. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు పాల్గొన ఆ టోర్నీలో నేను విశేషంగా రాణించా. బంగ్లాపై 9 వికెట్లు తీయడం నా కెరీర్‌ను మార్చేసింది’ అని ఇర్పాన్‌ తెలిపాడు. (‘హర్భజన్‌.. నీకు మాత్రం ఈజీ కాదు’)

భారత్‌ తరఫున 19 ఏళ్లకు అరంగేట్రం చేసిన ఇర్ఫాన్‌.. చాలాకాలం జట్టులో ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. బ్యాటింగ్‌పై కూడా ఎక్కువ ఫోకస్‌ చేయడంతో బౌలింగ్‌ కాస్త గాడి తప్పడంతో ఇర్ఫాన్‌ కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోయింది. 2012లో భారత్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన ఇర్ఫాన్‌.. చాలా కాలం చోటు కోసం నిరీక్షించాడు. కానీ ఇక జట్టులో తనకు చోటు ఇవ్వరని భావించి ఈ ఏడాది ఆరంభంలోనే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో పలు ఘనతలు సాధించిన ఇర్ఫాన్‌.. భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అదే సమయంలో పాకిస్తాన్‌ గడ్డపై హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా ఇర్ఫాన్‌ రికార్డు నెలకొల్పాడు. 2004లో సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని పాక్‌ పర్యటనకు వెళ్లిన ఇర్పాన్‌ హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. తన పేస్‌కు స్వింగ్‌ను జోడించి పాకిస్తాన్‌ నడ్డి విరిచాడు. ఆపై 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జోహెన్నెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top