బీసీసీఐ సెలక్టర్లపై ఇర్ఫాన్‌ తీవ్ర విమర్శలు

Irfan Pathan Lashes Out At The Indian Selectors - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బీసీసీఐ సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశాడు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)లో సెలక్టర్లు ఆటగాళ్ల కెరీర్‌ను అర్థాంతరంగా ముగించేస్తారంటూ మండిపడ్డాడు. ఇక్కడ 30 ఏళ్లకే వృద్ధుల్ని చేసే ఆనవాయితీ ఎప్పుట్నుంచో వస్తుందంటూ ధ్వజమెత్తాడు. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌లో ఆటగాళ్ల కెరీర్‌ కొన్ని సందర్భాల్లో 30 ఏళ్లకు ఆరంభమైతే, మనకు మాత్రం ఆ వయసుకు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితిని కల్పిస్తారని ఆరోపించాడు. ఈ మేరకు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ అంతర్జాతీయ కెరీర్‌ 29 ఏళ్లకు ఆరంభమైందనే విషయాన్ని ఇర్ఫాన్‌ ప్రస్తావించాడు. ఇక భారత్‌లో క్రికెటర్‌ వయసు 30 ఏళ్లు అయితే అరంగేట్రం అనేది అసలే ఉండదన్నాడు. ఆ వయసులో ప్లేయర్లను సెలక్టర్లు కనీసం పరిగణలోకి తీసుకోవడానికి మొగ్గుచూపక పోవడం దురదృష్టకర అంశమన్నాడు. మరొకవైపు సదరు ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తే కానీ విదేశీ లీగ్‌లు ఆడటానికి అనుమతి ఇవ్వరనే విషయాన్ని కూడా ఇర్ఫాన్‌ ఉదహరించాడు. ఎలాగూ 30 ఏళ్లు వస్తే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వనప్పుడు కనీసం విదేశీ లీగ్‌లు ఆడటానికి అయినా అనుమతి ఇస్తే బాగుంటుందన్నాడు. దీనికి రిటైర్మెంట్‌ను ముడిపెట్టాల్సిన అవసరం లేదని ఇర్ఫాన్‌ సూచించాడు. (ఒక్క చాన్స్‌ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా)

కాగా, పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత పేసర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌ రికార్డు నెలకొల్పాడు. అప్పట్లో అతడి స్వింగ్ బౌలింగ్‌ను పాక్ లెజెండ్ వసీం అక్రమ్‌తో పోల్చేవారు. బౌలింగ్‌తోపాటు తనలోని బ్యాటింగ్ ప్రతిభనూ ఇర్పాన్ బయటపెట్టి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అయితే రెండింటిపై ఏకకాలంలో దృష్టి పెట్టడంతో పఠాన్ బౌలింగ్‌ కొద్దిగా గాడి తప్పింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పటికి ఇర్ఫాన్ వయసు 28 సంవత్సరాలే. అప్పటి నుంచి తిరిగి జట్టులోకి రావాలని పఠాన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఈ ఏడాది ఆరంభంలో తన రిటైర్మెంట్‌ను ఇర్ఫాన్‌ ప్రకటించాడు. తాజాగా ఇదే విషయంపై సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ఇర్ఫాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓవరాల్‌గా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఇర్ఫాన్‌ 301 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా మెరిసి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,500కు పైగా పరుగులు చేశాడు.(ఆ రెండే నా ఫేవరెట్‌ మ్యాచ్‌లు: కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top