భారత బాక్సింగ్ బాధ్యతల్ని స్పాన్సర్లకు అప్పగిస్తూ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తమకు సమాచారమే లేదని వెల్లడి
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ బాధ్యతల్ని స్పాన్సర్లకు అప్పగిస్తూ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించింది. బాక్సింగ్‌కు కొత్త సమాఖ్య ఏర్పడేదాకా నిర్వహణ బాధ్యతల్ని బాక్సింగ్ ఇండియా పేరిట ఏర్పడిన స్పాన్సర్ల గ్రూపునకు ఏఐబీఏ అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) నిబంధనల ప్రకారం.. ఏ గ్రూపునైనా ఆమోదించేముందు ఏఐబీఏ తప్పనిసరిగా జాతీయ ఒలిం పిక్ కమిటీని సంప్రదించాల్సివుంటుందని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. తమకుగానీ, తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కుగానీ ఈ విషయంలో ఎటువంటి సమాచారం లేదని ఆయన వెల్లడించారు. ‘ఏ జాతీయ క్రీడా సమాఖ్యకైనా ఐఓఏ గుర్తింపు తప్పనిసరి. అథ్లెట్లు ఎవరైనా అంతర్జాతీయ పోటీలకు ఐఓఏ తరఫునే వెళ్లాలి. ఏఐబీఏ తీరు ఐఓసీ నిబంధనలకు విరుద్ధం’ అని మెహతా అన్నారు. కొద్ది రోజుల్లో ఐఓఏ సీనియర్ సభ్యులంతా ఢిల్లీలో సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.