కొత్త జంట  కుదిరింది | indian cricket odi bowlers now:Chahal, Kuldip Yadav | Sakshi
Sakshi News home page

కొత్త జంట  కుదిరింది

Feb 6 2018 12:48 AM | Updated on Feb 7 2018 10:14 PM

indian cricket odi bowlers now:Chahal, Kuldip Yadav - Sakshi

యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌

ఆరు నెలల క్రితం వరకు...
టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ స్పిన్‌ బౌలర్లెవరంటే మరో మాట లేకుండా రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా పేర్లే చెప్పేవారు. ఇంకొకరికి అవకాశం వచ్చినా అది వీరు తప్పుకొంటేనో, గాయపడితేనో మాత్రమే.

మరిప్పుడు...
నాలుగంటే నాలుగే సిరీస్‌లు... ఆరు నెలల వ్యవధి... అంతా మారిపోయింది... వన్డేలు, టి20ల్లో అశ్విన్, జడేజా ఊసే లేదు. టెస్టుల్లో నంబర్‌వన్‌ బౌలర్లైనా, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎందుకు ఎంపిక చేయడం లేదన్న ప్రశ్నే తలెత్తడం లేదు. ఇదంతా మరో ఇద్దరి మణికట్టు మాయాజాలం. వారే యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌. 

సాక్షి క్రీడా విభాగం: బహుశా సగటు క్రికెట్‌ అభిమాని కూడా ఇంత తక్కువ కాలంలో ఇంతటి మార్పును ఊహించి ఉండకపోవచ్చు. అందుకేనేమో, ఎటుపోయి ఎటు వస్తుందోనని సెలెక్టర్లు కూడా అశ్విన్, జడేజాలను శ్రీలంక పర్యటనకు మొదట ‘విశ్రాంతి’ పేరిట మాత్రమే పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో తీసుకున్న చహల్, కుల్దీప్‌ ప్రతిభావంతులే అయినా అంత తేలిగ్గా సీనియర్లను తప్పిస్తే విమర్శలు వస్తాయని భావించారు. ఒకవేళ కొత్తవారు విఫలమైతే తర్వాత ఆలోచించవచ్చని అనుకున్నారేమో. కానీ, ఆ అవకాశం లేకుండా చేశారీ మణికట్టు మాంత్రికులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, తాజాగా సఫారీ పర్యటనలో రెండు వన్డేల్లోనూ విజయాలనందించి జట్టుకు అదనపు బలంగా మారారు. 

తక్కువ వేగమే ఆయుధం... 
15... చివరి అయిదు వన్డేల్లో చహల్‌ తీసిన వికెట్లు... 10... కుల్దీప్‌ గత అయిదు వన్డేల్లో పడగొట్టిన వికెట్లు. అటు పరుగుల కట్టడితో పాటు ప్రత్యర్థిని చుట్టేస్తుండటంతో వీరి సత్తాపై క్రమక్రమంగా నమ్మకం పెరుగుతోంది. ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను కూడా వీరు తేలిగ్గా పెవిలియన్‌కు పంపుతున్నారు. ‘పరుగులు పోతే పోనీ... వికెట్‌ మాత్రం పడగొట్టు’ అన్నది కెప్టెన్‌ కోహ్లి అభిప్రాయం కావడంతో చహల్‌ తనకు ఇష్టమైన ఫ్లయిటెడ్‌ డెలివరీలను సంధిస్తున్నాడు. గంటకు 80 కి.మీ. నుంచి 90 కి.మీ. బౌలింగ్‌ వేగం మించనప్పటికీ వీరిని ఎదుర్కొనలేకపోవడం ప్రొటీస్‌ కోచ్‌లనే ఆశ్చర్యపరుస్తోంది.

పిచ్‌లకు తగ్గట్లు మారిపోయి... 
దక్షిణాఫ్రికా పిచ్‌లంటేనే పేస్‌. అలాంటిచోట కూడా చహల్, కుల్దీప్‌ చెలరేగుతున్నారు. దీనంతటికీ కారణం పిచ్‌లను అర్థం చేసుకోవడం.. తగినట్లు సన్నద్ధం కావడమే. 2013–14 పర్యటనలో అశ్విన్, జడేజా సరిగ్గా ఈ పనే చేయలేకపోయారు. డికాక్‌ వరుసగా మూడు శతకాలతో చెలరేగిన ఈ టూర్‌లో వీరు చెరో వికెట్‌ మాత్రమే పడగొట్ట గలిగారు. కానీ చహల్, కుల్దీప్‌ మాత్రం వికెట్‌పై ఉండే బౌన్స్‌ను తమ బౌలింగ్‌కు సమన్వయం చేసుకుంటున్నారు. బ్యాట్స్‌మెన్‌ బ్యాక్‌ఫుట్‌పై ఆడేలా బంతులేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఇక్కడి బౌన్సీ వికెట్లపై ఎక్కువ వేగంతో బంతులేస్తే స్పిన్‌ తిరగవు. బ్యాట్స్‌మెన్‌ తేలిగ్గా ఆడేస్తారు. ఈ కిటుకును మన స్పిన్నర్లు కనిపెట్టి వేగంలో కొంత రాజీ పడ్డారు. సఫారీ ప్రధాన స్పిన్నర్‌ తాహిర్, చైనామన్‌ షమ్సీ మాత్రం సహజ శైలిని నమ్ముకుని తేలిపోతున్నారు.   భారత్‌లో కంటే ఇక్కడ బౌలింగ్‌ చేయడాన్నే తాను ఆస్వాదిస్తున్నానని కుల్దీప్‌ అంటున్నాడంటనే అతడెంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో తెలుస్తోంది. మరోవైపు భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం చహల్‌కు బాగా పనికొస్తోంది. ఆ సమయంలోనే పిచ్‌లను బాగా అర్థం చేసుకున్న అతడు మరింతగా రాణిస్తున్నాడు. మంచి బౌన్స్‌తో బంతి వేగంగా వెళ్తుండటంతో అతడికి ఎక్కువగా ఆలోచించే అవసరమే లేకుండా పోతోంది. 

ప్రతిఘటించే వారేరి..? 
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో భారత స్పిన్నర్లను సమర్థంగా ఆడే వారు కనిపించడం లేదు. డుమిని, మిల్లర్‌ తడబడుతున్నారు. మిగతా వారికి అంతగా అనుభవం లేదు. సొంత గడ్డపై కొంత మెరుగ్గా ఉన్నా నాణ్యమైన స్పిన్‌ను ఆడటంలో దక్షిణాఫ్రికాది తొలి నుంచీ పేలవ రికార్డే. ఈసారి ఇక్కడా రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో  మన మణికట్టు మాంత్రికులను ప్రతిఘటించే బ్యాట్స్‌మెన్‌ లేనట్లే. వీరి జోరు కొనసాగితే సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ భారత్‌ సొంతం కావడం ఖాయం.

పరిస్థితులను బాగా అర్థం చేసుకొని దాని ప్రకారం బౌలింగ్‌ చేయడమే దక్షిణాఫ్రికాతో వన్డేల్లో భారత లెగ్‌స్పిన్నర్ల విజయ రహస్యం. నా దృష్టిలో చహల్, కుల్దీప్‌ బౌలింగ్‌లో ఉన్న కొత్తదనం కూడా ఫలితాన్ని ఇస్తోంది. ఇది మణికట్టు స్పిన్‌ గురించో, ఆఫ్‌ స్పిన్‌ గురించో కాదు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోవడమే ఇక్కడ ముఖ్యం. టి20లు వచ్చిన కొత్తలో స్పిన్నర్లు పనికి రారని తేల్చేశారు. ఆపై పదేళ్ల పాటు ఆఫ్‌ స్పిన్నర్లు రాజ్యమేలారు. ఇప్పుడు లెగ్‌ స్పిన్నర్లు బాగా వేస్తున్నారు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడం గురించి నేనేమీ నిద్ర మానేసి ఆలోచించడం లేదు. నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా ఏ జట్టులోనైనా స్థానం పొందగలననే నమ్మకం నాకుంది.     
 – దక్షిణాఫ్రికాలో భారత స్పిన్నర్ల ప్రదర్శనపై అశ్విన్‌ వ్యాఖ్య    

Advertisement
 
Advertisement
Advertisement