గెలిపించేదెవరు..?

Indian batsmen perform poorly in both Tests - Sakshi

రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శన

ఒకరిని మించి మరొకరి వైఫల్యం

కోహ్లి తప్పిస్తే అంతా డొల్ల   

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మినహాయిస్తే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు దాటలేకపోయారు. లార్డ్స్‌ టెస్టులో వోక్స్‌ అజేయంగా చేసినన్ని పరుగులు కూడా టీమిండియా మొత్తం కలిపి ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చేయలేకపోయింది. నంబర్‌వన్‌ టీమ్, విదేశీ గడ్డపై చెలరేగే సత్తా ఉందంటూ సిరీస్‌కు ముందు కోచ్‌ రవిశాస్త్రి ఎంత ఊదరగొట్టినా... మన బ్యాట్స్‌మెన్‌ ఆట చూస్తే మాత్రం మళ్లీ పాత రోజులే గుర్తుకు తెచ్చాయి. అన్నీ మరచి సిరీస్‌ స్కోరును 2–1గా చేయడమే ప్రస్తుతం తమ కర్తవ్యమంటూ కెప్టెన్‌ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా మానసికంగా దుర్బలంగా మారిన ఈ జట్టును గెలిపించే బాధ్యత ఎవరు తీసుకోగలరు?  

సాక్షి క్రీడా విభాగం: ఇంగ్లండ్‌ గడ్డపై ప్రస్తుతం ఆడుతున్న టెస్టు సిరీస్‌ను 0–5తో చిత్తుగా కోల్పోయినా భారత జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌ మాత్రం చెక్కుచెదరదు! సొంతగడ్డపై ఎదురు లేని ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ర్యాంక్‌ మారదు సరే కానీ తమ స్థాయికి తగినట్లుగా ఆడటం మాత్రం మన వల్ల కావడం లేదు. 2011లో వయసైపోయిన ఆటగాళ్ల వల్లే అన్నారు. 2014లో ఇంకా కుర్రాళ్లే, నేర్చుకుంటున్నారని సమాధానం వినిపించింది. మరి ఇప్పుడు ఏమని వివరణ ఇవ్వగలరు? పైగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ అనుభవం నేపథ్యంలో ముందుగా వెళ్లి సన్నద్ధమవుతామని జట్టు అడిగితే బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కోరినట్లుగా ముందు టి20లు, ఆ తర్వాత వన్డేలు ముగిశాక టెస్టు సిరీస్‌ ఆడతామంటే ప్రత్యర్థి అయినా ఇంగ్లండ్‌ బోర్డు కూడా షెడ్యూల్‌ను దానికి అనుగుణంగా మార్చింది. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. సరిగ్గా చెప్పాలంటే నాలుగేళ్లలో మన జట్టు ఏమాత్రం మెరుగు పడలేదు.  

ఎవరిని నమ్మాలి... 
ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, తాజాగా ఇంగ్లండ్‌లో రెండు టెస్టులు కలిపి చూస్తే ఉపఖండం బయట భారత బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శన సాధారణ స్థాయిలో కూడా లేదని అర్థమవుతుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్న వేళ ఎవరిని తప్పించి ఎవరికి అవకాశం ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మన జట్టులో కనిపిస్తోంది. విదేశాల్లో ఓపెనర్‌గా భారత్‌కు శుభారంభం అందిస్తాడని భావించిన మురళీ విజయ్‌ తన ఆట ఎప్పుడో మరచిపోయాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 128 పరుగులు చేశాడు. ఇక ధావన్‌ (17.75 సగటు) గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. పుజారా క్రీజ్‌లో పాతుకుపోయే అలవాటు ఉన్నా, ఆ ఆరంభాన్ని సరిగ్గా వాడుకోనేలేదు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 454 బంతులు ఆడిన అతను 118 పరుగులు మాత్రమే చేశాడు. రెండు సార్లు మాత్రం 20 పరుగులు (ఒక అర్ధ సెంచరీ) దాటగలిగాడు. రహానేలాంటి క్లాస్‌ ఆటగాడిపై పెట్టుకున్న నమ్మకం కూడా వృథా అయింది. ఇక ఎంతో కాలం తర్వాత పునరాగమనం చేసిన దినేశ్‌ కార్తీక్‌ ఓనమాల దశలోనే ఉండిపోయినట్లున్నాడు. ఏమాత్రం ప్రాధాన్యత లేని నిదాహస్‌ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి కొట్టిన సిక్సర్‌ అతనికి కొత్త జీవితాన్నిచ్చిందే గానీ టెస్టులకు మాత్రం పనికి రాలేదు. ఈ ఐదు టెస్టుల్లో కలిపి కోహ్లి ఒక్కడే 505 పరుగులు చేస్తే మిగతా టాప్‌–5 ఆటగాళ్లంతా కలిపి 526 పరుగులు మాత్రమే చేయగలిగారు. లార్డ్స్‌లో కూడా కోహ్లి ఎలా ఆడాలో చెబితే తప్ప ఇతర ఆటగాళ్లు ఆడలేని పరిస్థితి కనిపించింది. ఒకవేళ కోహ్లి వెన్ను నొప్పితో తర్వాతి టెస్టుకు దూరమైతే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది.  

వీరికి బాధ్యత లేదా... 
2014లో ఘోర వైఫల్యం తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌ జో డాస్, పెన్నీలను బీసీసీఐ తప్పించింది. మరి ఇప్పుడు జట్టు సహాయక సిబ్బందిలో ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేది చూడాలి. స్లిప్స్‌లో మనోళ్లు క్యాచ్‌లు వదిలేస్తున్న తీరు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ పనితీరును ప్రశ్నిస్తుండగా, సంజయ్‌ బంగర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఏం చేస్తున్నాడనేది ప్రశ్నార్ధకం. అతను వచ్చిన నాలుగేళ్లలో ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా బంగర్‌ వల్ల తన ఆట మెరుగైనట్లుగా చెప్పలేదు! అన్నింటికి మించి హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పాత్రపైనే స్పష్టత లేదు. కోహ్లి చెప్పిన అన్నింటికీ తలూపడం మినహా శాస్త్రి కోచ్‌గా ఏం చేస్తున్నాడనేదానిపై అందరికీ సందేహాలే ఉన్నాయి. తన కెప్టెన్సీలో 37 టెస్టుల్లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఒకే జట్టును కొనసాగించని కోహ్లి శైలి, దానికి కోచ్‌ మద్దతు ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని కూడా పెంచింది. లార్డ్స్‌ టెస్టులో వాతావరణం చూసిన తర్వాత కూడా రెండో స్పిన్నర్‌ వైపు మొగ్గు చూపడంలో కోచ్‌ వైఫల్యం కూడా ఉంది. మావాళ్లు సూపర్‌ అంటూ ఇంటర్వ్యూలలో చెలరేగిపోయే శాస్త్రి తనలోని కామెంటేటర్‌ను పక్కన పెట్టి కోచ్‌గా ఆలోచించాలనేది విస్తృత అభిప్రాయం. తామెవరికీ జవాబుదారీ కాదని కెప్టెన్, కోచ్‌ అనుకోవచ్చు గానీ తాజా పరిస్థితిపై తమకు తామే సమాధానం ఇచ్చుకుంటేనే సిరీస్‌లో మున్ముందు సానుకూల ఫలితాలకు దారులు తెరచుకుంటాయేమో!

తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు తర్వాతి టెస్టులో అవకాశం ఉంది. ఆటగాళ్లు చేయగలిగింది ఇదే. నాకు తెలిసి మనోళ్ల బ్యాటింగ్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవు. వాతావరణ పరిస్థితుల గురించి నేను మాట్లాడను. టాస్, వాతావరణం మన చేతుల్లో ఉండవు కదా. మనం సన్నద్ధమై వస్తే ఇలాంటివి ఇబ్బందిగా అనిపించవు. అయినా వీటి గురించి ఆలోచిస్తే భవిష్యత్తు గురించి ఏమీ చేయలేం. ఐదు రోజుల్లో వెన్నునొప్పినుంచి కోలుకుంటాననే నమ్మకముంది. అయితే 100 శాతం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా. 
– విరాట్‌ కోహ్లి  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top