కోహ్లి అంచనా తప్పింది..!

India Lost Kohlis Wicket Against New Zealand In 2nd Odi - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. మయాంక్‌ అగర్వాల్‌(3),  పృథ్వీ షా(24; 19 బంతుల్లో 6 ఫోర్లు)లు ఐదు ఓవర్లకే పెవిలియన్‌ చేరితే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(15) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు.  టిమ్‌ సౌతీ వేసిన 10 ఓవర్‌ నాల్గో బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సౌతీ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను ఆన్‌సైడ్‌లో ఫ్లిక్‌ చేద్దామని ప్రయత్నించిన కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. ఆ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరటేయడంతో కోహ్లి భారంగా నిష్క్రమించాడు. (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!)

సాధారణంగా ఇటువంటి షాట్లు కొట్టడంలో ఎక్కువగా ఫెయిల్‌ కానీ కోహ్లి అంచనా ఈసారి తప్పడంతో భారత్‌ ఒక్క పెద్ద వికెట్‌ను నష్టపోయింది. కోహ్లి ఔట్‌ కావడంతో కివీస్‌ మ్యాచ్‌పై పట్టుసాధించేందుకు వీలుచిక్కింది. అదే ఓవర్‌లో తొలి బంతికి కోహ్లి ఆడిన బంతి ప్యాడ్లను తాకింది. దాంతో కివీస్‌ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్‌ చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. దానికి రివ్యూకి వెళ్లే సాహసం కూడా కివీస్‌ చేయలేదు. అయితే అది రిప్లేలో వికెట్ల పైనుంచి వెళుతుందని తేలడంతో కివీస్‌ రివ్యూకి వెళ్లకపోవడమే మంచిదైంది. కాకపోతే ఆ ఓవర్‌లోనే కోహ్లి ఔట్‌ కావడంతో కివీస్‌ ఊపిరి పీల్చుకుంది.  కాసేపటికి కేఎల్‌ రాహుల్‌(4) కూడా పెవిలియన్‌ చేరడంతో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.(ఇక్కడ చదవండి; టేలర్‌ సరికొత్త రికార్డు)

సౌతీ ‘సిక్సర్‌’
వన్డే ఫార్మాట్‌లో కోహ్లిని ఎక్కువ సార్లు ఔట్‌ చేసిన జాబితాలో రవి రాంపాల్‌తో కలిసి సౌతీ సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఆరుసార్లు సౌతీకే కోహ్లి ఔట్‌ కాగా, అంతకుముందు విండీస్‌ బౌలర్‌ రవి రాంపాల్‌కు కూడా అన్నేసార్లు వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక బౌలర్‌ తిషారా పెరీరా, ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాలు ఐదేసి సార్లు ఔట్‌ చేసి  సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. కాగా, అన్ని ఫార్మాట్లలో కలిపి చూసినా సౌతీకే కోహ్లి ఎక్కువ సార్లు వికెట్‌ను ఇచ్చాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లిని సౌతీ 9సార్లు ఔట్‌ చేయగా, అండర్సన్‌, గ్రేమ్‌ స్వాన్‌లు 8సార్లు కోహ్లిని ఔట్‌ చేశారు. ఇక జంపా, రాంపాల్‌, మోర్కెల్‌లు ఏడేసిసార్లు కోహ్లిని పెవిలియన్‌కు పంపారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top