సిరీస్‌ను సాధిస్తారా?

India Look To Clinch Series At Visakhapatnam - Sakshi

విశాఖ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గత మ్యాచ్‌లో అద్బతమైన విజయాన్ని సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో విజయం సాధించి మరో సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు టీమిండియా తమ వ్యూహాలకు పదును పెడుతోంది. మొహాలీలో జరిగిన రెండో వన్డేలో లంకేయుల్ని చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్‌ను సమం చేసింది. దాంతో సిరీస్‌ ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది.  తొలి వన్డేలో లంకేయుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆదివారం డా.వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. రేపు మధ్యాహ్నం గం. 1.30 ని.లకు నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఆరంభం కానుంది.

సుదీర్ఘ కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయిన లంకేయులు.. వన్డేల్లో కూడా దాదాపు అదే కథను పునరావృతం చేశారు. ప్రధానంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత గడ్డపై  లంక పూర్తిగా తలవంచింది.ఇక్కడ ఇప్పటివరకూ తొమ్మిది వన్డే సిరీస్‌ల్లో తలపడిన లంక ఒక్కసారి సిరీస్‌ను డ్రా చేసుకోవడం మినహా ప్రతీసారి ఓడింది. ఇటీవలే తమ దేశంలో కూడా టీమిండియా చేతిలో 0–5తో చిత్తుగా ఓడిన ఆ జట్టు.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో గెలుపును అందుకుంది. కాగా, రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించి లెక్కను సరిచేసింది. ఇదిలా ఉంచితే, గత ఏడాదిన్నర కాలంలో ఏడు  ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. ఆ క్రమంలోనే మరొక సిరీస్‌పై దృష్టిసారించింది.

విశాఖలో తిరుగులేని రికార్డు..

టీమిండియాకు విశాఖలో తిరుగులేని రికార్డు ఉంది. ఇప‍్పటివరకూ ఇక్కడ ఏడు వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్‌ ఐదింట విజయం సాధించింది. మరొకమ్యాచ్‌లో ఓటమి పాలు కాగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక్కడ గతేడాది అక్టోబర్‌లోన్యూజిలాండ్‌తో  చివరిసారి వన్డే మ్యాచ్‌లో తలపడిన టీమిండియా 190 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 79 పరుగులకు ఆలౌటైంది.

రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డు..

విరాట్‌ కోహ్లి గైర్హాజరీతో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. తాజాగా శ్రీలంకతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర ఆట తీరుతో డబుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్‌ చరిత్రలో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా  రికార్డు సృష్టించాడు. రోహిత్‌ శర్మను మరొక రికార్డు కూడా ఊరిస్తోంది. ఈ ఏడాది భారత్‌ తరపున అత్యధిక వన్డే సెంచరీలు సాధించడానికి రోహిత్‌కు ఒక్క శతకం మాత్రమే అవసరం. గత మ్యాచ్‌ ద్వారా విరాట్‌ కోహ్లి ఆరు సెంచరీల రికార్డును రోహిత్‌ సమం చేశాడు. ఈ సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండటంతో రోహిత్‌ శర్మ సెంచరీ సాధిస్తే ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.

ఇదిలా ఉంచితే, టెస్టు సిరీస్‌ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు..శ్రీలంక కంటే  చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో టీమిండియానే మెరుగ్గా ఉంది. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌లతో భారత్‌ జట్టు బ్యాటింగ్‌లో ఎంతో బలంగా ఉంది. అదే సమయంలో బౌలింగ్‌లో బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లు ఉండనే ఉన్నారు. అయితే ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ను కుప్పకూల్చిన శ్రీలంక తాము ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పింది. సంచలనాలకు మారుపేరైన లంకను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టీమిండియా సమష్టిగా రాణిస్తేనే లంకను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. లంక జట్టులో సీనియర్‌ ఆటగాడు మాథ‍్యూస్‌తో పాటు డిక్వెల్లా, లహిరు తిరుమన్నే, ఉపుల్‌ తరంగాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి ఏ జట్టు సమష్టిగా పోరాడి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top