అమీతుమీకి సిద్ధం! 

India and England are the last one-day - Sakshi

నేడు భారత్, ఇంగ్లండ్‌ చివరి వన్డే

గెలిచిన జట్టుదే సిరీస్‌

పట్టుదలగా కోహ్లి సేన

ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్‌... రెండో మ్యాచ్‌లో ఓడినా చివరి వరకు పోరాడగలిగింది. జట్టులో లోపాలేమీ కనిపించకుండా చివరి మ్యాచ్‌లో చెలరేగింది. అయితే వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పరాజయం మాత్రం భారత్‌ బలహీనతలను బయట పెట్టింది. ముఖ్యంగా మిడిలార్డర్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చూపించింది. ఇప్పుడు వాటిని అధిగమించి చివరి వన్డేలో విజయంతో ఈ పర్యటనలో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా? ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుందా అనేది ఆసక్తికరం.   

లీడ్స్‌: టి20లాగే వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్‌ చివరి సమరానికి సిద్ధమైంది. నేడు ఇక్కడి హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. వన్డేల్లో కొంత కాలంగా తిరుగులేని ప్రదర్శన కనబరస్తున్న ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌ పరాజయం నుంచి వెంటనే కోలుకొని సత్తా చాటింది. ఈ సిరీస్‌నైనా గెలుచుకుంటే సొంతగడ్డపై తమ పరువు నిలబడుతుందని ఆ జట్టు భావిస్తోంది. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా ఇంగ్లండ్, భారత్‌ తమ మొదటి, రెండు ర్యాంక్‌లు నిలబెట్టుకుంటాయి. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై భారీ స్కోరు ఖాయం.  

రైనా స్థానంలో కార్తీక్‌! 
ఇంగ్లండ్‌తో ఈ పర్యటనలో ఆడిన ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌ మూడు గెలిచింది. వీటిలో టాపార్డర్‌లో రోహిత్‌ రెండు, రాహుల్‌ ఒక సెంచరీ చేశారు. కోహ్లి, ధావన్‌ కూడా రాణించారు. కాబట్టి టాప్‌–3 విషయంలో ఎలాంటి సమస్యా లేదు. మిడిలార్డర్‌ వైఫల్యంతోనే లార్డ్స్‌ వన్డేను టీమిండియా కోల్పోయింది. ఈ విషయంలో రాహుల్, ధోని, రైనా, పాండ్యా మరింత మెరుగవ్వాల్సి ఉంది. నెమ్మదైన ఆటతో అనూహ్యంగా ధోని కూడా ప్రేక్షకుల హేళనలకు గురయ్యాడంటే గత మ్యాచ్‌ పరిస్థితి అర్థమవుతుంది. యోయో టెస్టులో రాయుడు వైఫల్యంతో మూడేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న రైనా ఫర్వాలేదనిపించినా అతను చాలా ఇబ్బంది పడుతూ ఆడటం కనిపించింది. ఎడమ చేతివాటం, బౌలింగ్‌ చేయడం అదనపు అర్హతగా రైనాకు చోటు లభిస్తున్నా... తాజా ఫామ్, షాట్ల వైవిధ్యాన్ని బట్టి చూస్తే దినేశ్‌ కార్తీక్‌ను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. టెస్టుల్లో ప్రధాన అస్త్రం కాగలడని భావిస్తున్న కుల్దీప్‌ యాదవ్‌ను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచుతారేమో చూడాలి. మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైతేనే భువనేశ్వర్‌ ఆడతాడని అసిస్టెంట్‌ కోచ్‌ బంగర్‌ ప్రకటించాడు.  

జేసన్‌ రాయ్‌కు గాయం!  
రెండో వన్డేలో విజయం తర్వాత ఇంగ్లండ్‌ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా కుల్దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఆ జట్టు 10 ఓవర్లలో 68 పరుగులు రాబట్టడం శిబిరంలో ఆనందం నింపింది. ఇదే జోరులో మరో మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ విజయంతో టి20 లెక్క సరి చేయాలని కెప్టెన్‌ మోర్గాన్‌ భావిస్తున్నాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ గాయపడటంతో అతని స్థానంలో జేమ్స్‌ విన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే దూకుడులో రాయ్‌కు సరిపోయే బిల్లింగ్స్‌ కూడా తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నాడు. లార్డ్స్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. హెడింగ్లీలో గత నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచిన ఇంగ్లండ్‌ అదే జోరు సాగిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. 

- సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ–టెన్‌ 3లలో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top