వెస్టిండీస్‌ లక్ష్యం 171

IND VS WI 2nd T20: West Indies Target 171 Runs - Sakshi

తిరువనంతపురం: సిరీస్‌ కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బౌలర్లు రాణించారు. దీంతో రెండో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది. ఓ దశలో రెండు వందలకు పైగా స్కోర్‌ సాధిస్తారని అనుకున్నారు. కానీ చివర్లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయడంలో సఫలీకృతమైన కరీబియన్‌ బౌలర్లు మామూలు స్కోర్‌కే పరిమితం చేయగలిగారు. భారత బ్యాట్స్‌మెన్‌లో యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే( 54; 30 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి అర్ధసెంచరీ సాధించాడు. చివర్లో రిషభ్‌ పంత్‌(33నాటౌట్‌; 22 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్‌) ఓ మోస్తారుగా రాణించాడు. వీరిద్దరూ మినహా ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఎవరూ రాణించలేదు.  

టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకిగి దిగిన రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌లు టీమిండియాకు శుభారంభాన్ని అందించలేదు. తొలుత రాహుల్‌(11) వెనుదిరగగా.. అనంతరం రోహిత్‌(15)కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్‌ దూబే జట్టు బాధ్యతను తీసుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదతూ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టించాడు. ఇదే జోరులో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే అదే ఊపులో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.

శివమ్‌ ఔట్‌ తర్వాత టీమిండియా కష్టాలు మొదలయ్యాయి. కోహ్లి(19), అయ్యర్‌(10), జడేజా(9) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ క్రమంలో పంత్‌ ఓ మోస్తారు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ భారీ స్కోర్‌ను అందించలేకపోయాడు. అయితే కరీబియన్‌ బౌలర్లు ముఖ్యంగా కాట్రెల్‌, విలియమ్స్‌ స్లో షార్ట్‌ బాల్స్‌తో పరుగులను భారీగా కట్టడి చేశారు. ఇక విండీస్‌ బౌలర్లలో విలియమ్స్‌ రెండు, వాల్స్‌ రెండు, కాట్రెల్‌, హోల్డర్‌, పియర్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top