విలియమ్సన్‌కు పూనకం.. | IND vs NZ: Williamson Blitz Sets New Zealand Up For Big Finish | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌కు పూనకం..

Jan 24 2020 2:09 PM | Updated on Jan 24 2020 2:29 PM

IND vs NZ: Williamson Blitz Sets New Zealand Up For Big Finish - Sakshi

ఆక్లాండ్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ 204 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్‌కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్‌ ఝుళిపించింది. పవర్‌ ప్లే ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి గప్టిల్‌(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ షాట్‌ కొట్టడానికి యత్నించగా స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అద్భుమైన క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో గప్టిల్‌ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్‌ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్‌ హోమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో కివీస్‌ 117 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. (ఇక్కడ చదవండి: రోహిత్‌.. నువ్వు సూపరో సూపర్‌!)

విలియమ్సన్‌కు పూనకం..
సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్‌ను రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం  26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్‌ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్‌ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్‌ టేలర్‌ నుంచి కూడా చక‍్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు  బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్‌ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.

చహల్‌ బాగా ఆఫ్‌సైడ్‌కు వేసిన బంతిని వెంటాడి షాట్‌కు యత్నించాడు. అయితే ఎడ్జ్‌ తీసుకోవడంతో పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, టేలర్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో న్యూజిలాండ్‌ రెండొందల మార్కును చేరింది.  టేలర్‌ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేయడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, శివం దూబే, చహల్‌, రవీంద్ర జడేజాలు తలో వికెట్‌ తీశారు. (ఇక్కడ చదవండి:  ‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement