స్మిత్ డబుల్ ధమాకా | Sakshi
Sakshi News home page

స్మిత్ డబుల్ ధమాకా

Published Thu, Dec 24 2015 12:32 AM

స్మిత్ డబుల్ ధమాకా

ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక
ఉత్తమ టెస్టు ఆటగాడి పురస్కారం కూడా తనదే
వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ డివిలియర్స్
►  భారత ఆటగాళ్లకు దక్కని అవార్డులు

 
 దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హవా కొనసాగించాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ పురస్కారం కూడా అతనికే దక్కింది. ఈ అవార్డుల్లో భారత్ క్రికెటర్లలెవ్వరికీ చోటు దక్కలేదు. అవార్డుల ఎంపిక కోసం ఐసీసీ 18 సెప్టెంబర్ 2014 నుంచి 13 సెప్టెంబర్ 2015 వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.
 
  ఈ కాల వ్యవధిలో స్మిత్ 13 టెస్టుల్లో 82.57 సగటుతో 1734 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. 26 వన్డేల్లో నాలుగు శతకాలతో 1249 పరుగులు సాధించాడు. అలాగే ఆసీస్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెలారంభంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసిన టెస్టు, వన్డే జట్లలోనూ స్మిత్ చోటు దక్కించుకున్నాడు. దిగ్గజాల మధ్య చోటు దక్కడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా స్మిత్ వ్యాఖ్యానించాడు.
 
  ఇలాంటి పురస్కారాలు ప్రత్యేకతను కల్పించినా... జట్టు గెలవడమే తనకు అత్యంత ప్రోత్సాహంగా ఉంటుందన్నాడు. వన్డేల్లో ‘ఉత్తమ క్రికెటర్’ అవార్డును దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వరుసగా రెండో ఏడాది కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు 2010లో కూడా ఏబీకి ఈ అవార్డు దక్కింది. ఓటింగ్ కాలంలో డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో 1265 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 128.4గా ఉంది. ఈ ఏడాది ఉత్తమ టి20 క్రికెటర్ పురస్కారం డు ప్లెసిస్‌కు లభించింది. 2015 జనవరి 11న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ 56 బంతుల్లోనే 119 పరుగులు చేయడం అవార్డును తెచ్చిపెట్టింది. ఇంగ్లండ్ అంపైర్ కెటిల్‌బొరో వరుసగా మూడో ఏడాది ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నారు.
 
  ప్రతిష్టాత్మక సోబర్స్ ట్రోఫీని సాధించిన 11వ ఆటగాడు స్మిత్. ఆసీస్ తరఫున నాలుగో క్రికెటర్. 2004లో అవార్డును ప్రవేశపెట్టినప్పట్నించి రికీ పాంటింగ్ (2006, 07), మిచెల్ జాన్సన్ (2009, 14), మైకేల్ క్లార్క్ (2013), ద్రవిడ్ (2004), ఫ్లింటాఫ్, కలిస్ (2005), చందర్‌పాల్ (2008), సచిన్ (2010), ట్రాట్ (2011), సంగక్కర (2012)లకు ఈ అవార్డు లభించింది.
 
  ఒకే ఏడాది రెండు అవార్డులు సాధించిన ఏడో క్రికెటర్ స్మిత్. ద్రవిడ్ (2004), కలిస్ (2005), పాంటింగ్ (2006), సంగక్కర (2012), క్లార్క్ (2013), జాన్సన్ (2014)లు ఒకే ఏడాది రెండు పురస్కారాలను సాధించారు.

Advertisement
 
Advertisement