తొలి సెమీస్‌కు వర్షం అడ్డంకి

ICC Women T20 World Cup: First Semi Final Updates - Sakshi

సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జరగనున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్‌ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, భారత జట్లు తలపడనున్నాయి. రిజర్వ్‌ డే లేకపోవడంతో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే భారత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్‌ చాన్స్‌ దక్కుతుంది. మొదటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌ రద్దయితే సఫారి టీమ్‌ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్‌ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!)

రిజర్వ్‌ డే ఎందుకు లేదు?
టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్‌ డే ప్రస్తావన లేకపోవడంతో దీన్ని పెట్టలేదు. ఆలస్యంగా మేలుకున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) తర్వాత రిజర్వ్‌ డే గురించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్‌ మ్యాచ్‌ల కోసం రిజర్వ్‌ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్‌ మార్చలేమని సీఏకు ఐసీసీ స్పష్టం చేసింది. సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top