‘అడ్డుగోడ’కు అడ్డంకులు

Hockey Player Rajini Ask Employment To Government - Sakshi

11 ఏళ్లుగా భారత హాకీ జట్టుకు ఆడుతోన్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి రజని

ఇప్పటికీ ఉద్యోగం లేని పరిస్థితి

అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: చిత్తూరు జిల్లాలోని యెనుమలవారిపల్లి గ్రామం... యెర్రవారిపాలెం మండల పరిధిలోని ఈ గ్రామంలో ఉండేది 30 కుటుంబాలే. అలాంటి చోటు నుంచి వచ్చిన ఒక అమ్మాయి జాతీయ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రాంతీయ అసమానతలు, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యం చాలా ఎక్కువగా కనిపించే హాకీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఆట ఒక్కటే సరిపోదు. అంకితభావం, పట్టుదల, పోరాటపటిమ, దృఢసంకల్పం కావాలి. ఇవన్నీ కలబోసిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఇటిమరపు రజని దశాబ్దకాలంగా గోల్‌కీపర్‌గా భారత జట్టులో కొనసాగుతోంది. ఇప్పటికే ఒకసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజని ... మరో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతోంది.  

వేగంగా దూసుకుపోయి... 
సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన రజని పాఠశాలస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హాకీ స్టిక్‌ చేతబట్టింది. ఆ తర్వాత విశేషంగా రాణిస్తూ పోయింది. గోల్‌కీపర్‌గా తొలి అవకాశం లభించగా... అదే పొజిషన్‌లో తన ఆటను మెరుగుపర్చుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా అండర్‌–14 రాష్ట్ర స్థాయిలో మొదలైన ప్రయాణం భారత సీనియర్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు సాగింది. జోనల్‌ ప్రదర్శన తర్వాత తొలిసారి 2009లో రజని భారత జట్టులోకి ఎంపికై ంది. అదే ఏడాది న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి భారత టీమ్‌ జెర్సీలో గోల్‌పోస్ట్‌ ముందు రక్షణగా, సగర్వంగా నిలబడింది. ఇది ఆమె కెరీర్‌లో మధుర క్షణంగా నిలిచింది.  

మరో ఒలింపిక్స్‌ కోసం... 
ఇటీవలే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న రజని తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత్‌ తరఫున 91 మ్యాచ్‌లు ఆడింది. పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగంగా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన జట్లలో ఆమె సభ్యురాలు. భారత జట్టు తొలిసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినప్పుడు, ఏడాది ముందుగా 2015లో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు కూడా గోల్‌కీపర్‌గా రజని కీలకపాత్ర పోషించింది. రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్‌లో రజని భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఆడిన మన భారత మహిళల జట్టులో తానూ ఉండటం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకమని ఆమె చెబుతుంది. ఇప్పుడు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత జట్టులోనూ ఆమె కూడా ఉంది. దాని సన్నాహాలు కొనసాగుతుండగానే కరోనా కారణంగా అంతా మారిపోయింది.  వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో భారత్‌ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, తాను కూడా చక్కటి ప్రదర్శన కనబర్చాలని రజని కోరుకుంటోంది.

శిక్షణకు బ్రేక్‌...
‘ఫిబ్రవరి 16న బెంగళూరు ‘సాయ్‌’ సెంటర్‌లో భారత జట్టుకు ఒలింపిక్స్‌ శిబిరం ప్రారంభమైంది. నెల రోజులకు పైగా అంతా బాగానే సాగింది. కోచ్‌ జోయెర్డ్‌ మరీన్‌ కొత్త పద్ధతుల్లో చక్కటి శిక్షణ అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కారణంగా క్రీడా కార్యకలాపాలను నిలిపివేశారు. దాంతో సుమారు రెండు నెలల కేవలం ఫిట్‌నెస్, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌కే ప్లేయర్లు పరిమితమయ్యారు. సడలింపుల తర్వాత ఆటగాళ్ళంతా ఇంటిపై బెంగ పెట్టుకోవడంతో హాకీ ఇండియా శిక్షణకు విరామం ఇచ్చింది. నెల రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రీడాకారిణులు కొత్త ఉత్సాహంతో తిరిగి రావాలని ఫెడరేషన్‌ కోరుకుంటోంది. అంతా తిరిగొచ్చాక మళ్లీ శిక్షణ మొదలవుతుంది. షెడ్యూల్‌ ప్రకారం మరో నాలుగు నెలల పాటు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేది సందేహమే.

అదొక్కటి చాలు...
పదకొండేళ్లుగా భారత్‌కు ఆడుతున్నా నాకు ఇప్పటి వరకు ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వరంగ సంస్థలో గానీ ఉద్యోగం లభించలేదు. ఏ క్రీడాంశంలోనైనా ఇన్ని సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడిన వారికి ఏదో ఒక ఉద్యోగం లభించడం సహజం. కానీ దురదృష్టవశాత్తూ నాకు అలాంటి అవకాశం దక్కలేదు. నా జట్టులోని సహచరులు అందరికీ వారి వారి రాష్ట్రాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా తగిన గుర్తింపు, హోదా ఉన్నాయి. నేను మాత్రం ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో అడ్డంకులను అధిగమించి భారత హాకీకి ప్రాతినిధ్యం వహించా. ఇప్పటికైనా నేను స్థిరపడేందుకు తగిన ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నా. –ఇటిమరపు రజని, భారత హాకీ గోల్‌కీపర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top