
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హరియాణా 35–26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. స్టీలర్స్ జట్టులో రైడర్ వికాస్ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్ (6) కూడా రైడింగ్‌లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్ (4), సునీల్ (4), ధర్మరాజ్ చేరలతన్ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా... సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది.
యూపీ, తమిళ్ మ్యాచ్ టై...
అంతకుముందు యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 28–28తో టై అయింది. తలైవాస్ స్టార్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) ఆటలు సాగలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.