అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం | Glitter and glamour mark opening ceremony | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం

Feb 1 2015 1:04 AM | Updated on Sep 2 2017 8:35 PM

అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం

అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా 35వ జాతీయ క్రీడలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

తిరువనంతపురం: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా 35వ జాతీయ క్రీడలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజధాని శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ది గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రత్యేక అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది, స్థానిక ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు. క్రీడల గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నందుకు సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వక్తలు మాస్టర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు చప్పట్లతో స్టేడియాన్ని మారుమోగించారు. దిగ్గజ అథ్లెట్లు పీటీ ఉష, అంజూ బాబీ జార్జి సంయుక్తంగా క్రీడా జ్యోతిని వెలిగించారు.

రీడల్లో పాల్గొంటున్న అన్ని రాష్ట్రాల అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ చేశాక ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో కేరళ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు. అలాగే మళయాల సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు ఈ వేడుకల్లో అధిక ప్రాధాన్యత కనిపించింది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని కళలను 5 వేల మంది కళాకారులు అద్భుత రీతిలో ప్రదర్శించారు. ఇదిలావుండగా రూ.600 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఈ క్రీడల ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికీ క్రీడా గ్రామానికి  తుది మెరుగులు దిద్దుతున్నారు. పలు స్టేడియాలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. నేటి నుంచి క్రీడలు జరుగుతాయి.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement