ఆ థర్డ్‌ అంపైర్‌ వికీపీడియా మార్చిన రోహిత్‌ ఫ్యాన్‌!

Fan Edits Third Umpire Wikipedia After Controversial Rohit Sharma Dismissal - Sakshi

లండన్‌ : వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విషయంలో థర్డ్‌ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఆడిన బంతి కీపర్‌ చేతుల్లో పడింది. విండీస్‌ అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దీనిపై విండీస్‌ రివ్యూ కోరింది. రీప్లేలో స్నికోలో కనిపించిన స్పైక్‌ను బట్టి థర్డ్‌ అంపైర్‌ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ గఫ్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి బ్యాట్‌కంటే ప్యాడ్‌కు తగిలినప్పుడు స్నికో స్పందించినట్లుగా, బంతికి బ్యాట్‌కు మధ్య కొంత ఖాళీ ఉన్నట్లు కూడా అనిపించింది. దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా థర్డ్‌ అంపైర్‌ మాత్రం తన నిర్ణయాన్ని భారత్‌కు ప్రతికూలంగా వెల్లడించాడు. దీంతో మైఖేల్‌ గఫ్‌ తీరుపై పలువురు క్రికెటర్లతో పాటు టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. (చదవండి: ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!)

ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన ఓ రోహిత్‌ అభిమాని ఏకంగా మైఖేల్‌ గఫ్‌ వికీపీడియా పేజీనే మార్చేశాడు. ఎడిట్‌ చేసి తనకిష్టమొచ్చినట్టు రాసుకొచ్చాడు. అంపైరింగ్‌ కెరీర్‌ ఉన్న చోట ‘2019లో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌కు మైఖేల్‌ని థర్డ్‌ అంపైర్‌గా నియమించారు. రోహిత్‌శర్మ ఔట్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటిస్తే దాన్ని తప్పుబడుతూ మైఖేల్‌ అత్యుత్సాహం చూపించాడు. రీప్లే దృశ్యాలను పట్టించుకోకుండా.. స్పష్టమైన ఆధారాలు లేకుండా రోహిత్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అతడు ఉద్దేశపూర్వకంగానే రెండు వరుస ఓటములు చవిచూసిన ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేర్చాలని చూస్తున్నాడు’ అంటూ పేర్కొన్నాడు. ఇలా ఎడిట్‌ చేసిన కొద్దిసేపటికే దీన్ని తొలగించారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నిర్ణయంపై రోహిత్‌ శర్మ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. బంతి బ్యాట్‌కు తగలలేదని స్పష్టంగా తెలియజేస్తున్న ఫొటోను జత చేస్తూ.. ఇది ఔటా? అని ప్రశ్నించాడు. (చదవండి: ఇప్పుడు చెప్పండి.. ఇది ఔటా?)

ఇక ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ గెలిచి సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఎలాగైనా గెలిచి సెమీస్‌ రేసులో నిలవాలని ఇంగ్లండ్‌ ఉవ్విళ్లూరుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top