షమీ...  ఊలాలా!

 Dressing room environment is helping me succeed: Mohammed Shami - Sakshi

వన్డేల్లో పేసర్‌ ఘన పునరాగమనం

లయ అందుకుని చక్కటి ప్రదర్శన

ప్రపంచ కప్‌ బెర్తు దాదాపు ఖరారు!

4/71, 5/47... టెస్టు అరంగేట్రంలోనే అదిరిపోయే వికెట్ల గణాంకాలు! 9–4–23–1... ఆడుతున్న తొలి వన్డేలోనే పొదుపైన బౌలింగ్‌తో ప్రశంసలు! అటు వేగం... ఇటు వ్యూహం కలగలిసిన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేస్తూ, యార్కర్లతో చుక్కలు చూపుతూ దూసుకొచ్చాడు మొహమ్మద్‌ షమీ. జహీర్‌ ఖాన్‌ రిటైర్మెంట్‌కు తోడు ఇషాంత్‌ శర్మ వంటి వారిలో పదును తగ్గుతూ భారత పేస్‌ దళం సంధి దశలో ఉండగా ఆశాకిరణంలా కనిపించాడు. ఈ అంచనాలను నిలబెట్టుకుంటూ టెస్టుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. భువనేశ్వర్‌తో కలిసి వన్డేల్లో అదిరిపోయే స్పెల్‌లతో శుభారంభాలనిచ్చాడు. 2015 ప్రపంచ కప్‌ సమయంలో ప్రధాన పేసర్‌ అతడే. కానీ, ఆ తర్వాతే కథ మారింది. గాయాలైతేనేమి? ఫామ్‌ లేమి అయితేనేమి? మారిన వన్డే నిబంధనలైతేనేమి? పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ నుంచి షమీ మాయమయ్యాడు. గత నాలుగేళ్లలో వేళ్ల మీద లెక్కపెట్టేన్ని వన్డేలే ఆడాడు. ఈ మధ్యలో భువీ మెరుగవడం, బుమ్రా దూసుకురావడంతో షమీ దారులు దాదాపు మూసుకుపోయాయి. టెస్టు ప్రదర్శనలతో... ఓ అవకాశం ఇచ్చి చూద్దామని భావించి స్వదేశంలో వెస్టిండీస్‌ సిరీస్‌లో ఆడిస్తే విఫలమయ్యాడు. కానీ, ఆస్ట్రేలియా పర్యటన అతడి గీత మార్చింది. వన్డేల నుంచి బుమ్రాకు విశ్రాంతితో మెరుగైన ప్రత్యామ్నాయంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు... దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌ పర్యటనలోనూ రాణించి, ప్రపంచ కప్‌ మూడో పేసర్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు.  

సాక్షి క్రీడా విభాగం:  డ్రెస్సింగ్‌ రూమ్‌లో టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీ ముద్దు పేరు ‘లాలా’! వరుసగా రెండు వన్డే సిరీస్‌లలో బౌలింగ్‌ ప్రదర్శనలతో ఈ ‘లాలా’ ఇప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. మైదానంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లతో చెలరేగుతున్న అతడిని మిగతా సభ్యులందరూ ప్రశంసిస్తూనే సరదాగా ఆట పట్టిస్తున్నారు. మరోవైపు సరిగ్గా ప్రపంచ కప్‌ సమయానికి అవసరమైన ఫామ్‌ను అందుకుని జట్టులో మూడో పేసర్‌ స్థానాన్ని షమీ దాదాపు ఖాయం చేసుకున్నాడు. నాణేనికి మరోవైపు చూస్తే అతడి వన్డే కెరీర్‌ అచ్చమైన ఎత్తుపల్లాలకు నిదర్శనంగా తెలుస్తుంది. భువీ కంటే ఎక్కువ బాధ్యతలు మోసిన దశ నుంచి ఒక్కసారిగా పడిపోయిన నేపథ్యం కనిపిస్తుంది.  

రెండేళ్లలో 40పైగా... నాలుగేళ్లలో 11 
అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు మెయిడెన్లు వేసిన ఏకైక భారతీయ బౌలర్‌గా మొదలైంది షమీ వన్డే కెరీర్‌. మంచి ఫామ్‌తో రెండేళ్లలో 40 పైగా మ్యాచ్‌లు ఆడేశాడు. 2015 వన్డే ప్రపంచ కప్‌ వరకు ఏకధాటిగా సాగిందతడి ప్రస్థానం. కానీ, ఇక్కడి నుంచే లయ దెబ్బతిన్నది. మధ్యలో గాయాలు, వ్యక్తిగత సమస్యలూ చుట్టుముట్టాయి. పదునైన బౌలర్‌ అయినప్పటికీ, పరుగులు ఇచ్చే బలహీనత కారణంగా వన్డేలకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌ సెమీస్‌ నుంచి ఇప్పటివరకు 11 వన్డేలే ఆడాడంటేనే అతడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో అలవాటైన పిచ్‌లపై ఆడే ఐపీఎల్‌లోనూ అతడి బౌలింగ్‌ గణాంకాలు దారుణం. లీగ్‌లో 100పైగా ఓవర్లు వేసిన 83 మంది బౌలర్లలో అత్యధిక ఎకానమీ (9.13) షమీదే కావడం గమనార్హం. వివిధ ఫ్రాంచైజీలకు 35 మ్యాచ్‌లు ఆడితే ఎందులోనూ 2 మించి వికెట్లు తీయలేదు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి దాదాపు తెరమరుగయ్యాడు. 

కప్పు బెర్తు  కొట్టేసినట్లే... 
భువీ, బుమ్రా తర్వాత వన్డేలకు సమర్థుడైన మూడో పేసర్‌ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్‌ వంటి చోట ఈ ఏడాది ప్రపంచ కప్‌ ఉండటంతో ఇది తప్పక దృష్టి సారించాల్సిన అంశమైంది. ఇందుకోసం శార్దుల్‌ ఠాకూర్‌ తదితరులను పరీక్షించినా ఎవరూ భరోసా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు షమీ ఫామ్‌ అందుకుని ఆ అన్వేషణకు తెరదించాడు. ఇంగ్లండ్‌లో ఆడటంతో పాటు రాణించిన అతడు... మూడో పేసర్‌గా ప్రపంచ కప్‌ విమానం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈలోగా గాయాల బారిన పడకుండా చూసుకోవడమే అతడు చేయాల్సింది.

2018 ప్రాణం పోసింది... 
చక్కటి రనప్, క్రమంగా వేగం పెంచే శైలి, బంతిని సరైన దిశలో వదిలే సామర్థ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పేసర్‌కు ఉండాల్సిన లక్షణాల్లో ఎక్కువ శాతం ఉన్న షమీ... నిలకడ ఒక్కటి లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టెస్టుల్లో ప్రదర్శన షమీకి దారులు తెరిచింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కూ చోటుదక్కేలా చేసింది. నాడు రెండు వన్డేల్లో విఫలమైనా... ఇటీవలి ఆస్ట్రేలియా, ప్రస్తుత న్యూజిలాండ్‌ పర్యటనల్లో నిలకడ నేర్చి ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అటు పరుగులు కూడా తక్కువగా ఇస్తూ, వన్డే కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటున్నాడు. ముఖ్యంగా కివీస్‌పై మూడు వన్డేల్లోనూ షమీ ప్రభావం చూపాడు. మౌంట్‌ మాంగనీలో ఎదురుగాలుల్లోనూ అతడు ప్రత్యర్థి ఓపెనర్లను ఇబ్బంది పెట్టిన తీరు ఆకట్టుకుంది. ఒక బంతి ముప్పు తప్పిందనుకుంటే మరో బంతితో దాడి చేసి చివరకు బ్యాట్స్‌మన్‌ వికెట్‌ ఇవ్వక తప్పదనేంతగా ఉంది ప్రస్తుతం షమీ ఊపు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top