ఈ రోజు టీమిండియాకు వెరీ వెరీ స్పెషల్‌

On this day India win the 1983 World Cup - Sakshi

లండన్‌: జూన్‌ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం టీమిండియా తొలి వన్డే వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో పటిష్టమైన వెస్టిండీస్‌ను ఓడించి వన్డే ఫార్మాట్‌లో విశ్వ విజేతగా అవతరించింది.  మైఖేల్‌ హోల్డింగ్‌ను మొహిందర్‌ అమరనాథ్‌ ఎల్బీ చేయడంతో టీమిండియా చాంపియన్‌గా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

1983 వరల్డ్‌ కప్‌లో భారత్‌ పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని భారత జట్టు సత్తా చాటింది. ప్రధానంగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ‘మెగా’ ఫైట్‌లో మట్టికరిపించి టీమిండియా టైటిల్‌ను ముద్దాడింది.  లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన తుది పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సునీల్‌ గావస్కర్‌(2) ఓపెనర్‌గా దిగి విఫలం కాగా, కృష్ణమాచారి శ్రీకాంత్‌(38), అమర్‌నాథ్‌(26), సందీప్‌ పాటిల్‌(27), కపిల్‌ దేవ్‌(15), మదన్‌లాల్‌(17), కిర్మాణి(14), బల్విందర్‌ సంధు(11), యాష్పల్‌ శర్మ(11)లు రెండంకెల స్కోరు చేశారు. దాంతో భారత జట్టు సాధారణ స్కోరుకు మాత్రమే పరిమితమైంది.

అయితే అటు తర్వాత భారత్‌ బౌలింగ్‌లో రెచ్చిపోయింది. వెస్టిండీస్‌ను 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్‌ చేసి ట్రోఫీని సాధించింది. మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌లాల్‌లు తలో మూడు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, సంధు రెండు వికెట్లతో మెరిశాడు. కపిల్‌దేవ్‌, రోజర్‌ బిన్నీళు తలో వికెట్‌ తీసి విజయంలో పాలు పంచుకున్నారు. వెస్టిండీస్‌ ఆటగాళ్లలో వివియన్‌ రిచర్డ్స్‌(33)దే అత‍్యధిక స్కోరు కావడం గమనార్హం.

కపిల్‌దేవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

విండీస్‌ జరిగిన ఫైనల్‌ పోరులో కపిల్‌దేవ్‌ పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌.  విధ్వంసకర ఆటగాడు వివియన్‌ రిచర్డ్స్‌ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను కపిల్‌ దేవ్‌ వెనక్కి పరుగెడుతూ అందుకున్న తీరు ప్రేక్షకుల్ని నివ్వెరపరిచింది. రిచర్డ్స్‌ క్యాచ్‌ను కపిల్‌ పట్టుకున్న తర్వాత మొత్తం గేమ్‌ స్వరూపమే మారిపోయింది. విండీస్‌ ఒత్తిడిలోకి వెళ్లి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 43 పరుగుల తేడాతో పరాజయం చెంది రన‍్నరప్‌గా సరిపెట్టుకుంది.  దాంతో హ్యాట్రిక్‌ సాధించాలన్న విండీస్‌ ఆశలు నెరవేరకపోగా, భారత్‌ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top