సందిగ్ధంలో క్రిస్‌ గేల్‌

Could I Un Retire From Odi Format, Chris Gayle - Sakshi

సెయింట్‌ లూసియా: వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే ఫార్మాట్‌ నుంచి వైదొలగనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్.. తన నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నాడు. స‍్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న గేల్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డాడు. తన వయసు 40 ఏళ్లకు దగ్గర పడుతున్న తరుణంలో గేల్‌ వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీన వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. తనకు వన్డే ఫార్మాట్‌లో వరల్డ్‌కపే చివరిదంటూ ప్రకటించేశాడు.

అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.  తొలి వన్డేలో 3 ఫోర్లు, 12 సిక్సర్లతో 135 పరుగులు చేసిన గేల్‌.. రెండో వన్డేలో 4 సిక్సర్లు, 1 ఫోర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాల్గో వన్డేలో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. దాంతో తన రిటైర్మెంట్‌ నిర్ణయంపై సందిగ్ధంలో పడ్డాడు గేల్‌. ‘నేను రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా. ఇప్పడు నా ఆట తీరు చూస్తుంటే రిటైర్మెంట్‌ నిర్ణయం సరైనది కాదేమో. రాబోవు రోజుల్లో నా ఆట తీరుకు శరీరం ఎంత వరకూ అనుకూలిస్తుందో చూడాలి. మరికొన్ని నెలల్లో నా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని గేల్‌ తాజాగా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top