హైదరాబాద్‌లో టి20, వైజాగ్‌లో వన్డే | BCCI announced the schedule | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టి20, వైజాగ్‌లో వన్డే

Aug 2 2017 12:09 AM | Updated on Sep 17 2017 5:03 PM

హైదరాబాద్‌లో టి20, వైజాగ్‌లో వన్డే

హైదరాబాద్‌లో టి20, వైజాగ్‌లో వన్డే

సొంతగడ్డపై కొత్త సీజన్‌లో భారత క్రికెట్‌ జట్టు ఫుల్‌ బిజీ బిజీ! ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే

నాలుగు నెలల్లో స్వదేశంలో 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు
షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ


కోల్‌కతా: సొంతగడ్డపై కొత్త సీజన్‌లో భారత క్రికెట్‌ జట్టు ఫుల్‌ బిజీ బిజీ!  ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు భారత్‌లో విరామం లేకుండా క్రికెట్‌ హోరెత్తించనుంది. ఈ నాలుగు నెలల కాలంలో భారత్‌లో ఏకంగా 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పాల్గొనేందుకు మన వద్దకు రానుండగా... ఆ తర్వాత వన్డేలు, టి20లతో పాటు టెస్టులు ఆడేందుకు శ్రీలంక ఇక్కడ అడుగు పెడుతుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ టూర్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌ కమిటీ ప్రకటించింది.

ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఒక టి20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ నగరం వేదిక కానుండగా... భారత్, శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. కొత్తగా నిర్మించిన బర్సపర (గువా హటి), తిరువనంతపురం స్టేడియాలకు కూడా ఒక్కో మ్యాచ్‌ను కేటాయించారు. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లు ఉన్నాయని... స్థానిక పండుగలు, సెలవు దినాలువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తర్వాత తేదీలు ఖరారు చేస్తామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి వెల్లడించారు.

రంజీ ట్రోఫీ ఫార్మాట్‌లో మార్పులు
భారత దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నిర్వహించిన తటస్థ వేదికల పద్ధతిపై తీవ్ర విమర్శలు రావడంతో దానికి స్వస్తి చెప్పారు. గతంలోలాగే కొన్ని హోం మ్యాచ్‌లు, కొన్ని బయటి మ్యాచ్‌ల పద్ధతితో టోర్నీని నిర్వహిస్తారు. అయితే నాకౌట్‌ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికల్లోనే జరుగుతాయి. అక్టోబర్‌ 6న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 28 జట్లతో మూడు గ్రూప్‌లలో మ్యాచ్‌లు నిర్వహించారు.

ఈసారి దీనిని మారుస్తూ మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లు ఎ, బి, సి, డి లుగా విభజిస్తున్నారు. ఒక్కో గ్రూప్‌లో 7 జట్లు ఉండగా, ప్రతీ జట్టు లీగ్‌ దశలో ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాప్‌–2 టీమ్‌లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ఫార్మాట్‌ వల్ల రంజీ ట్రోఫీ మొత్తం మ్యాచ్‌ల సంఖ్య తగ్గనుంది. మరోవైపు ఈ సారి కూడా దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ను గులాబీ బంతితోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement