చివర్లో ఉత్కంఠ... షూటౌట్‌లో మరింత

Australias hattrick in World Cup hockey tournament - Sakshi

హ్యాట్రిక్‌’ దారిలో ఆసీస్‌ సడెన్‌ ‘డెత్‌’

ఫైనల్లో నెదర్లాండ్స్‌

నేడు బెల్జియంతో టైటిల్‌ పోరు

ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌ 

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్‌’ ఆశలు సెమీస్‌లో షూటౌటయ్యాయి. ఆఖరి క్షణాల్లో ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ‘సడెన్‌ డెత్‌’లో 4–3తో విజేతగా నిలిచింది. గత ప్రపంచకప్‌లో తమ సొంతగడ్డపై ఫైనల్లో (1–6తో) ఎదురైన పరాభవానికి నెదర్లాండ్స్‌ బదులు తీర్చుకుంది. అక్కడ టైటిల్‌ను దూరం చేసిన కంగారూ జట్టును ఇక్కడ సెమీస్‌లోనే కసిదీరా ఓడించి ఇంటిదారి పట్టించింది. 2–1తో ఆధిక్యంలో ఉన్న ‘డచ్‌’ జట్టు విజయానికి అర నిమిషం దూరంలోనే ఉంది. కానీ ఈ అర నిమిషమే మ్యాచ్‌ గతిని మార్చేసింది. 26 సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా ఆస్ట్రేలియా గోల్‌ చేసింది. అంతే 2–2తో స్కోరు సమమైంది. నెదర్లాండ్స్‌ జట్టులో గ్లెన్‌ షుర్మన్‌ (9వ ని.), సీవ్‌ వాన్‌ అస్‌ (20వ ని.) చెరో గోల్‌ చేయగా, ఆసీస్‌ తరఫున టిమ్‌ హోవర్డ్‌ (45వ ని.), ఎడ్డి ఒకెండన్‌ (60వ ని.) ఒక్కో గోల్‌ సాధించారు.

దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. నిర్ణీత 5 షాట్‌ల తర్వాత ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3–3తో సమమైంది. ఆస్ట్రేలియా తరఫున డానియెల్‌ బీల్, టామ్‌ క్రెయిగ్, వెటన్‌... ‘డచ్‌’ జట్టులో జిరోన్‌ హెర్ట్‌బెర్గెర్, వాన్‌ అస్, తిజ్స్‌ వాన్‌ డామ్‌ స్కోరు చేశారు. ఇరు జట్లలో ఇద్దరు చొప్పున విఫలమయ్యారు. ఇక సడెన్‌ డెత్‌లో ముందుగా నెదర్లాండ్స్‌ ఆటగాడు హెర్ట్‌బెర్గెర్‌ గోల్‌ కొట్టగా... డానియెల్‌ బీల్‌ ఆస్ట్రేలియాను నిరాశపరిచాడు. ‘డచ్‌’ గోల్‌ కీపర్‌ పిర్మిన్‌ బ్లాక్‌ చాకచక్యంగా బంతిని వేగంగా లయ తప్పించగా బిత్తరపోవడం బీల్‌ వంతయింది. నెదర్లాండ్స్‌ మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో బెల్జియం 6–0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి మొదటిసారి ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top