టీమిండియాకే సపోర్ట్‌ చేయండి: అక్తర్‌

Akhtar urges Pakistani fans to back India against England - Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఆదివారం భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందునుంచే సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.  ఈ మ్యాచ్‌లో మీ సపోర్ట్‌ ఎవరికి అని పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఒక ప్రశ్న సంధించడంతో ఇప్పుడు అదే హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఇందుకు భారత్‌కే సపోర్ట్‌ అంటూ అధిక సంఖ్యలో పాక్‌ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా.  ఇందుకు కారణం భారత్‌పై ఇంగ్లండ్‌ ఓడిపోతే సెమీస్‌ రేసు నుంచి నిష్ర్రమిస్తుంది. అదే సమయంలో వరుస విజయాలు సాధిస్తూ రేసులోకి వచ్చిన పాక్‌ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోనే ఇంగ్లండ్‌పై భారత్‌ గెలవాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

దీనికి పాక్‌ మాజీ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు బాగానే ఉంది. టీమిండియాకే సపోర్ట్‌ ఇవ్వాలంటూ పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆ దేశ అభిమానులకు విన్నవించాడు. ‘ పాకిస్తాన్‌లో ఉండే పాక్‌ అభిమానులు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కే సపోర్ట్‌ చేయండి. పాకిస్తాన్‌ సెమీస్‌కు క్వాలిఫై అవ్వాలంటూ ఇంగ్లండ్‌ ఓడిపోవాలి. అప్పుడు బంగ్లాదేశ్‌పై పాక్‌ గెలిస్తే సెమీస్‌కు ఎటువంటి సమీకరణాలు లేకుండా వెళుతుంది. దాంతో ఇక్కడ రెండో మాట లేకుండా భారత్‌కే మద్దతు తెలపండి.  భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నాను. అలాగే పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ గెలవాలని అనుకుంటున్నాను’ అని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్‌లో ఉంటున్న పాక్‌ అభిమానులు మాత్రం ఆ జట్టుకే సపోర్ట్‌ ఇస్తారని అనుకుంటున్నానని అక్తర్‌ తెలిపాడు. ఆ దేశపు నీరు, వారి ఆహారం తింటున్న కారణంగా అక్కడి ఉండే పాకిస్తానీలు ఇంగ్లండ్‌కే మద్దతు తెలపడం సమంజసమని పేర్కొన్నాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top