అసహనంతో ‘పంచ్‌’ విసిరి...

Aiden Markram Ruled Out Of Ranchi Test With Injured Wrist - Sakshi

గాయంతో మార్క్‌రమ్‌ అవుట్‌

రాంచీ: భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ సిరీస్‌ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. పుణే టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్‌ అయిన మార్క్‌రమ్‌ మ్యాచ్‌ తర్వాత ఆ అసహనాన్ని ఒక ‘బలమైన వస్తువు’పైన చూపించాడు. దాంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు ఎముకల్లో ఫ్రాక్చర్‌ ఉందని తేలినట్లు దక్షిణాఫ్రికా టీమ్‌ ప్రకటించింది. దాంతో అతను చికిత్స కోసం గురువారం దక్షిణాఫ్రికా పయనమయ్యాడు.

అతని స్థానంలో సఫారీలు మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. శనివారంనుంచి రాంచీలో మూడో టెస్టు జరుగుతుంది. ఇప్పటికే భారత్‌ సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. సీనియర్‌ జట్టుకంటే ముందుగా ‘ఎ’ టీమ్‌ తరఫున మార్క్‌రమ్‌ భారత్‌లో అడుగు పెట్టాడు. ఒక మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన అతను... ఆ తర్వాత విజయనగరంలో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా మరో శతకం బాదాడు. దాంతో ఎంతో ఆశలతో టెస్టు బరిలోకి దిగిన అతను విశాఖపట్నంలో 5, 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పుణేలో రెండో ఇన్నింగ్స్‌లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాక రివ్యూకు అవకాశం ఉన్నా... మానసికంగా అప్పటికే కుంగిపోయిన అతను దానికీ సాహసించలేదు. రీప్లేలో అది నాటౌట్‌గా తేలింది.

‘ఈ రకంగా స్వదేశం తిరిగి వెళ్లడం బాధాకరం. నేను చేసింది పూర్తిగా తప్పే. దానికి బాధ్యత వహిస్తాను. మంచి వాతావరణం ఉన్న మా జట్టులో నాపై నమ్మకముంచినవారిని నిరాశపర్చడం నన్ను ఎక్కువగా వేదనకు గురి చేస్తోంది. క్రీడల్లో కొన్ని భావోద్వేగాలు దాటిపోయి అసహనం పెరిగిపోతుంది. నాకూ అదే జరిగింది. దీనికి సహచరులకు క్షమాపణ కూడా చెప్పాను. ఈ తప్పును దిద్దుకుంటా’ అని మార్క్‌రమ్‌ వివరణ ఇచ్చాడు. మూడో టెస్టులో మార్క్‌రమ్‌ స్థానంలో జుబేర్‌ హమ్జాకు తుది జట్టులో చోటు లభించవచ్చు.  

భారత్‌లో ఎంతో నేర్చుకోవచ్చు: ఎల్గర్‌
ఒక్కసారి భారత పర్యటనకు వస్తే ఎంతో అనుభవం లభిస్తుందని, వ్యక్తిగతంగా  కూడా అనేక మార్పులు వస్తాయని దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ వ్యాఖ్యానించాడు. అది మైదానంలో కావచ్చు లేదా మైదానం బయట కూడా కావచ్చని అతను అన్నాడు. ‘భారత పర్యటన ఒక సవాల్‌లాంటిది. క్రికెటర్‌గా, వ్యక్తిగా కూడా ఎంతో మెరుగయ్యేందుకు ఇది అవకాశం కలి్పస్తుంది. మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. బయటకు వెళ్లినప్పుడు చిన్న నగరాలు, పెద్దగా సౌకర్యాలు లేని హోటళ్లలో కూడా ఉండాల్సి వస్తుంది. ఇలాంటివి మన గురించి మనం తెలుసుకునేందుకు పనికొస్తాయి’ అని ఎల్గర్‌ అభిప్రాయపడ్డాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top