సార్‌ మిమ్మల్ని చనిపోనివ్వం : ట్రాఫిక్‌ పోలీసులు | Traffic Police Biker Photographed Without Helmet In HYD | Sakshi
Sakshi News home page

సార్‌ మిమ్మల్ని చనిపోనివ్వం : ట్రాఫిక్‌ పోలీసులు

Apr 30 2018 10:53 AM | Updated on Sep 4 2018 5:44 PM

Traffic Police Biker Photographed Without Helmet In HYD - Sakshi

ట్విటర్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షేర్‌ చేసిన ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ : నగర రోడ్లపై అడ్డదిడ్డంగా వెళ్లిపోదామనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ వాహనదారుడు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల కంట్లో పడ్డాడు. కృష్ణారెడ్డి అనే ఆ వ్యక్తికి సంబంధించిన ట్రాఫిక్‌ పోలీసుల సోషల్‌మీడియా టీమ్‌ ఓ ఫొటోను ఈ-చలాన్‌తో పాటు షేర్‌ చేసింది.

బైక్‌ వెనుక భాగంలో ‘నో హెల్మెట్‌, ఐ డై లైక్‌ రియల్‌ మెన్‌’ అంటూ స్టిక్కరింగ్‌ ఉంది. దీనిపై స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు.. ‘కృష్ణా రెడ్డి గారు మీరు మమ్మల్ని క్షమించాలి. మేం మిమ్మల్ని చనిపోనివ్వం. నిజమైన మగాడిలా మీరు బ్రతికేలా మేం చేస్తాం’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల ట్వీట్‌పై ‘నేనైతే ఇక ఎప్పుడూ హెల్మెట్‌ పెట్టుకోకుండా బయటకు వెళ్లను’ అంటూ ఓ నెటిజన్‌ రీట్వీట్‌ చేశారు. వాహనదారుల తప్పులను నొప్పించక సరిచేస్తున్న నగర ట్రాఫిక్‌ పోలీసులపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement