ఇంటికి చేరుకునేలోపే...  | one dead one injured in bike dcm collision | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరుకునేలోపే... 

Feb 14 2018 4:52 PM | Updated on Feb 14 2018 4:52 PM

one dead one injured in bike dcm collision - Sakshi

మృతిచెందిన యువకుడు విక్రమ్‌ 

పరిగి : పండగపూట విషాదం చోటు చేసుకుంది. అందరూ ఉపవాస దీక్షల్లో మునిగిపోతే..ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎదురురెదుగా వస్తున్న డీసీఎం, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌గేట్‌ సమీపంలో పరిగి–షాద్‌నగర్‌ రోడ్డుపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గాలిగూడెం అనుబంధ గ్రామం ఇస్రాన్‌గడ్డతండాకు చెందిన విక్రమ్‌(19), అదే తండాకు చెందిన హన్ము(13) స్నేహితులు.

విక్రమ్‌ అన్న బతుకుదెరువు కోసం బొంబాయి వెళుతుండటంతో సాగనంపేందుకు వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని రైలెక్కించి తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్‌ గేట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న విక్రం (19) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్ము(13)కు తీవ్ర గాయాలవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విక్రమ్‌ షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతుండగా.. హన్ము గాలిగూడెం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌ మృతదేహాన్ని పరిగి మార్చురీలో ఉంచారు.

 

1
1/1

తీవ్రంగా గాయపడిన హన్ము

Advertisement
 
Advertisement
Advertisement