‘పరిషత్‌’లోనూ కారు జోరు

ZPTC Elections TRS Party Winning Josh In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కారు టాప్‌ గేర్‌లో దూసుకెళ్లింది. కారు స్పీడ్‌కు ఇతర పార్టీలు కకావికలం అయ్యాయి. అత్యధిక ఎంపీటీసీ, జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం ఎంపీటీసీల్లో సగం గులాబీ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఇక జెడ్పీటీసీల్లో 16 స్థానాలను కారు ఎగరేసుకుపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు మంగళవారం జిల్లాలో ఐదు కేంద్రాల్లో జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 257 ఎంపీటీసీలకుగాను ఏకగ్రీవాలతో కలుపుకుని 128 స్థానాలు గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. ఆమనగల్లులో అధికార పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.

కాంగ్రెస్‌ పార్టీ 73 ఎంపీటీసీ స్థానాలతో సరిపెట్టుకుంది. భారీగా ఎంపీటీసీ స్థానాలు గెలుస్తామని గంపెడాశలు పెట్టుకున్న బీజేపీ 18 స్థానాలకు పరిమితమైంది. ఆ పార్టీ అత్యధికంగా కందుకూరు మండలంలో ఏడు, మహేశ్వరం మండలాల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 29 స్థానాల్లో గెలిచి సత్తా చాటారు. అలాగే తలకొండపల్లి మండలంలో ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) పార్టీ గాలి వీచింది. ఇక్కడ 12 ఎంపీటీసీల్లో.. ఆరింటిలో విజయ కేతనం ఎగురవేసింది. మంచాల మండలం జాపాలలో సీపీఎం అభ్యర్థి గెలువగా.. తలకొండపల్లి మండలంలో ఒక్క స్థానాన్ని జనసేన సొంతం చేసుకుంది
.  
మూడు మండలాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్‌ 
ఆది నుంచి కాంగ్రెస్‌కు మంచి పట్టున్న కాంగ్రెస్‌.. ఎంపీటీసీ ఫలితాల్లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. మూడు మండలాల్లో కనీసం బోణీ చేయకపోవడం గమనార్హం. ఆమనగల్లు, మహేశ్వరం, శంకర్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్‌ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. స్వతంత్రులు, బీజీపీ అభ్యర్థులు విజయం సాధించినా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మాత్రం ఒక్కరూ నెగ్గలేకపోయారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌కు దగ్గరైన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మహేశ్వరం సెగ్మెంట్‌ పరిధిలోకి వచ్చే మహేశ్వరం, కందుకూరు మండలాల్లో 29 ఎంపీటీసీలు ఉండగా.. కందుకూరు మండలంలో ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. సబిత తన వర్గాన్నంతా టీఆర్‌ఎస్‌ విజయం కోసం శ్రమించేలా చేశారని స్పష్టమవుతోంది. మొత్తం మీద గ్రామాల్లో ‘కారు’ స్పీడుకు ఇతర పార్టీల అభ్యర్థుల అడ్రస్‌ గల్లంతైంది. మొత్తం 21 మండలాల్లో.. 17 మండలాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. నాలుగు మండలాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కవ ఎంపీటీసీలను కాంగ్రెస్‌ గెలుచుకుంది.

జెడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ జోరు 
జెడ్పీటీసీ స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 21 స్థానాలకు గాను.. 16 చోట్ల కారుకు ఓటర్లు జైకొట్టారు. నాలుగు జెడ్పీటీసీల్లో కాంగ్రెస్‌ నెగ్గింది. శంషాబాద్, ఆమనగల్లు, మహేశ్వరం, కేశంపేట, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, నందిగామ, యాచారం, కడ్తాల్, శంకర్‌పల్లి, కందుకూరు, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కొత్తూరు జెడ్పీటీసీల్లో గులాబీ దళం పాగా వేసింది. మాడ్గుల, ఇబ్రహీంపట్రం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్‌ జెడ్పీటీసీలు ‘హస్త’గతం అయ్యాయి. తలకొండపల్లి జడ్పీటీసీ స్థానాన్ని ఏఐఎఫ్‌బీ దక్కించకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top