
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు(Telangana Local Body Elections Schedule) నరాగా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మూడు విడుతల్లో స్థానిక సంస్థలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
ఎన్నికల సంఘం కమిషనర్(Telangana Elections) సోమవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించారు. ఎన్నికల కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1,12,280 వార్డులు ఉన్నాయి. 81,61,984 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్టు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
- రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
- అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషేన్ విడుదల.
- మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
- అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్,
- అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు,
- అక్టోబర్ 31న, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.
- నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్.
- పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 11.
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 15.
ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు 14 ఎంపీటీసీలు, 27 జీపీలు, 246 వార్డులకు ఎన్నికలను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగులో 25 జీపీలు, కరీంనగర్‌లోని రెండు జీపీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

