ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు జరపాలని సర్కార్ యోచన
హైకోర్టులో గ్రామపంచాయతీ ఎన్నికలపై కేసు ఉండటంతో తొలుత వాటి నిర్వహణకు సానుకూలం
జీపీ ఎన్నికలు జరగక కేంద్రం నుంచి నిలిచిపోయిన రూ.3 వేల కోట్ల నిధులు
దీంతో ముందుగా ఈ నిధులు సాధించేలా, కోర్టు కేసు నుంచి ఉపశమనం పొందేలా కృషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై తదుపరి విచారణ జరిగే ఈ నెల 24లోగా సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 17న జరిగే కేబినెట్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకున్న వెంటనే.. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నట్టు 18న కోర్టుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సర్కారు తెలియజేయనున్నట్టు సమాచారం.
అదీగాకుండా హైకోర్టులో కేసు కూడా గ్రామపంచాయతీ ఎన్నికలపైనే ఉండటంతో, తొలుత ఆ ఎన్నికలు నిర్వహించా లని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్ని కల నిర్వహణకు సంబంధించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కూడా సంకేతాలిచ్చారు. కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలపై సహచర మంత్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని, కోర్టులో ఉన్న కేసు పరిస్థితి, ప్రస్తుత పరిణామాలపై బేరీజు వేశాక నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.
పథకాలకు ప్రజల మద్దతు
తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ మెజారిటీతో గెలవడంతో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ప్రజలు మద్దతు తెలిపారని ప్రభుత్వపెద్దలు భావిస్తున్నారు. అందువల్ల ఈ ఊపులోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు కూడా వెళితే సానుకూల ఫలితాలు సాధించవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మటుకు నిధులు, అభివృద్ధి పనులు, ఇతర అవసరాల కోసం అధికారంలో ఉన్న పారీ్టకేప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గ్రామపంచాయతీ పాలక మండళ్ల కాలపరిమితి ముగిసి 21 నెలలు కావొస్తున్నా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. అందువల్ల ఆ నిధుల కోసమైనా వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 21 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు విడుదలకాక పల్లెల్లో పాలన చేజారుతుండటంతో దానిని వెంటనే చక్కదిద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎస్‌ఈసీ సిద్ధం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన వంటి రాజకీయ పరమైన నిర్ణయాలపై స్పష్టత వచ్చాక జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళితే బావుంటుందనే అభిప్రాయంతో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కూడా ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు హైకోర్టుకు తెలియజేసింది. స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల శాతం, ఎన్నికల తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన వెంటనే నిర్వహణ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పింది.


