‘పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే’

 yv subbareddy slams ap government over Polavaram Tenders extension - Sakshi

పోలవరాన్ని రాష్ట్రానికి  వదిలిపెట్టొద్దు

ముడుపుల కోసమే పోలవరం టెండర్ల గడుపు పెంపు

ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం కోసం మా పోరాటం ఆగదు

వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ఎంపీ పదవులకు రాజీనామాకు సిద్ధం

సాక్షి, రాజమండ్రి : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరాన్ని రాష్ట్రానికి వదిలిపెట్టొద్దని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కాంట్రాక్టర్ల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం టెండర్లను మళ్లీ పొడిగిస్తూ గడువు పెంచడం ఏంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్రమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే..మళ్లీ కొత్త టెండర్లకు జనవరి 5వ తేదీ వరకు షెడ్యూల్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు.

కేంద్రం వద్దు అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఎలా మార్చుతుందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. కేవలం ముడుపుల కోసం టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను మార్చుకొని, వారి ముసుగులో దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చూస్తూ ఊరుకోమని, పోలవరంపై కేంద్రాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ ఒత్తిడి తెస్తుందని తెలిపారు. 2019 ఏప్రిల్‌లోగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండు చేస్తుందని చెప్పారు.

ఇదే విషయంపై ఈ నెల 22వ తేదీన కేంద్ర మంత్రిని కలువబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాము ప్రాజెక్టు పనులు పరిశీలించిన సందర్భంలో... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, కాంట్రాక్టర్ల పనితీరు చూస్తే వారి వల్ల ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదని తమ పరిశీలనలో తేలిందన్నారు. గడ్కారి, కేంద్ర జలవనరుల శాఖమంత్రి పోలవరాన్ని సందర్శించాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం కోసం తమ పార్టీ పోరాటం చేస్తునే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా వీటి కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాడుతూనే ఉంటారని చెప్పారు. తుది అంశంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని తమ అధ్యక్షులు వైమెస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇదివరకే చెప్పినట్లుగా తాము కట్టుబడి ఉన్నామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top