భూ దందాపై విచారణ కోరండి

YSRCP parliamentary party Fires On TDP in All Party Meeting - Sakshi

అఖిలపక్ష భేటీలో టీడీపీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ సూచన

అమరావతి పేరుతో భూములు కాజేశారు

బినామీలను కాపాడుకునేందుకే బాబు దొంగ ఉద్యమాలు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తూ అఖిలపక్ష సమావేశం సాక్షిగా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలను వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమర్థంగా తిప్పికొట్టింది. రాజధాని అంశాన్ని ప్రస్తావించి రాజకీయం చేయాలని ప్రయత్నించిన టీడీపీ అభాసుపాలైంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సెస్‌ ధరలకు కాంట్రాక్టులు అప్పగించడం, ఇప్పుడు శాసన మండలి ద్వారా ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ చేస్తున్న యత్నాలను ఢిల్లీ వేదికగా గురువారం అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎండగట్టింది. 

బాబు బినామీలు భూములు కాజేశారు
అఖిలపక్ష సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ అమరావతికి రైతులు భూములిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు చేసిందని, తనపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేస్తే బెయిల్‌పై వచ్చానని చెప్పడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి స్పందిస్తూ అమరావతిలో భూ దందాపై విచారణ కోరాలని సూచించారు. ‘చట్టాన్ని ధిక్కరించే చర్యలకు పాల్పడటం, పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించడం,  ప్రజలను రెచ్చగొడుతూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లడం చట్టాన్ని అతిక్రమించినట్టు కాదా..?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తనపై దాడి జరిగిందని, మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని గల్లా జయ్‌దేవ్‌ డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు బినామీలు రాజధాని పేరుతో భూములు కాజేసి రైతులను మోసగించారని చెప్పారు. రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దొంగ ఉద్యమాలు చేస్తున్నారని, రైతుల కోసం కాదన్నారు. రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. 

అక్రమాలు జరగకుంటే ‘రివర్స్‌’తో మిగులు ఎలా?
గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తున్నారన్న టీడీపీ ఎంపీల వాదనతో విజయసాయిరెడ్డి విభేదించారు. గత ఐదేళ్లలో రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బులను రాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలతో ప్రయోజనం చేకూర్చేలా సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తెచ్చారని చెప్పారు. రివర్స్‌ ద్వారా ఇప్పటికే రూ.2 వేల కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరగకుంటే ఇన్ని డబ్బులెలా మిగులుతాయని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న సభ వారి మేలు కోసం చట్టాలు చేస్తే ఇంకా ఏమైనా మార్పుచేర్పులు ఉంటే సూచించి ప్రజలకు మేలు జరిగేలా చూడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు.

ఖజానాపై అదనపు భారం పడుతున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అఖిలపక్ష సమావేశం సందర్భంగా తమని మందలించినట్లు టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. టీడీపీ చౌకబారు ప్రకటనలు మానుకోవాలని లేదంటే హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు. ‘మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మేం ప్రస్తావించిన అంశాలకు టీడీపీ మద్దతు ఇవ్వకపోవడం గర్హనీయం’ అని పేర్కొన్నారు. కాగా అఖిలపక్ష సమావేశం అనంతరం గల్లా జయదేవ్, కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియాతో మాట్లాడారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top