అందరూ ఒక్కటైనా..! | YS Jaganmohan Reddy achieved record success in AP | Sakshi
Sakshi News home page

అందరూ ఒక్కటైనా..!

May 24 2019 5:32 AM | Updated on May 24 2019 5:32 AM

YS Jaganmohan Reddy achieved record success in AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య సౌధానికి శాసన నిర్మాణ వ్యవస్థ.. కార్యనిర్వాహక వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ మూడు స్తంభాలైతే.. మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, అక్రమాలపై జనం పక్షాన అక్షరయుద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉంటుంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మీడియాపై ఉంది. కానీ.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఎల్లో మీడియా ఆ బాధ్యతను విస్మరించి ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అడ్డగోలుగా విషం కక్కింది. విలువలకు వలువలు వదిలేసి.. ప్రభుత్వ ఖజానానూ ఇష్టారాజ్యంగా దోచేస్తూ.. సీఎం చంద్రబాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యానికి అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచింది. ఇలా చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా పన్నిన ‘కుట్ర’లన్నింటినీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఎల్లో మీడియా విషం చిమ్ముతున్నా లెక్క చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై అలుపెరగకుండా పోరాటంచేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఇదే ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రికార్డు స్థాయి విజయాన్ని కట్టబెట్టింది. 

టీడీపీ చరిత్రలో ఘోరమైన ఓటమి
టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ లేని రీతిలో ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని ఇప్పుడు చవిచూసింది. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ.. అధికారం చేపట్టాక ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. వందిమాగధులు, బినామీలతో కలిసి ప్రభుత్వ ఖజానా, సహజ వనరులను చంద్రబాబు యథేచ్ఛగా లూటీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలోను, ప్రజాక్షేత్రంలోనూ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ అరాచాకాలపై పోరాటం చేయాల్సిన మీడియా తన ధర్మాన్ని విస్మరించి.. ప్రతిపక్ష నేతగా బాధ్యతతో వ్యవహరిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మింది. అదే సమయంలో సీఎం చంద్రబాబుకు దన్నుగా నిలిచాయి. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చికి 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నా ఎల్లో మీడియా స్పందించలేదు. ఇసుక మాఫియా ఆగడాలకు చిత్తూరు జిల్లా ఏర్పేడులో 14 మంది అసువులు బాసినా నోరు మెదపలేదు. రాజధానిలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో పచ్చ కాలకేయులు మహిళల మానప్రాణాలతో చెలగాటమాడినా ఎల్లో మీడియాకు పట్టలేదు.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రైతుల నుంచి 25 వేల ఎకరాల భూములను అత్తెసరు ధరలకే కాజేసి రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న చంద్రబాబు అండ్‌ కో ఆగడాలు ఎల్లో మీడియాకు కన్పించలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో.. రాష్ట్రానికి చుక్కానిగా నిలవాల్సిన పోలవరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు దోచేసినా మీడియాకు పట్టలేదు. దోచేసిన సొమ్ముతో విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసించినా.. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో పట్టుబడినా పచ్చ మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా.. ప్రజాసమస్యల పరిష్కారం. సర్కార్‌ దోపిడీపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు కనుసైగల మేరకు అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా అసత్య కథనాలను వార్చుతూ వచ్చింది. అంతేకాదు.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో మండుటెండను కూడా లెక్క చేయకుండా 3,648 కి.మీల మేర చేసిన సుదీర్ఘ పాదయాత్రను కూడా చిన్నదిగా చూపించేందుకు కుయుక్తులు పన్నింది.

చివరకు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను మట్టుబెట్టి భయభ్రాంతులకు గురిచేసి విజయం సాధించాలనే ధ్యేయంతో వైఎస్‌ జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని ప్రభుత్వ పెద్దలే హత్య చేయించారు. హత్య చేసిన కిరాతకులను వదిలిపెట్టి.. ఆ హత్యను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపైకి నెట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్రలకు ఎల్లో మీడియా పదును పెట్టి ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేసింది. ఎల్లో మీడియా అంతా ఒక్కతాటిపైకి వచ్చి చేసిన విష ప్రచారాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చంద్రబాబు, టీడీపీ నేతల దురాగతాలను వివరిస్తూ.. వాటికి ఎల్లో మీడియా కొమ్ముకాస్తున్న తీరును విడమర్చి చెబుతూ ప్రజలకు వాస్తవాలను వివరించారు. నిజాలను తెలుసుకున్న ప్రజలు ప్రజానేత ఎవరో ఎంచుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. దాంతో ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో.. రికార్డు స్థాయిలో విజయదుంధుబి మోగించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement