గిరిజనులను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు: జగన్‌

YS Jagan Meeting With Tribals In Prajasankalpayatra - Sakshi

సాక్షి, గోపాలపురం : గిరిజనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం ప్రకాశరావుపాలెంలో గిరిజనులతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీడీపీ పాలన చాలా అధ్వానమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి బాబు ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

గిరిజనులకు ఇళ్లు ఇవ్వలేదు, భూములూ ఇవ్వలేదు. గూడెంలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేశారా అని జననేత నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులు ఏమైయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీయండి. రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఎక్కడైనా కనిపించిందా అని వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రంలో 7 గిరిజన అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏడు నియోజకవర్గాల్లో 6 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచిన విషయాన్ని జననేత గుర్తు చేశారు. గిరిజనులకు నాన్నగారు 13 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు.

 
గిరిజనుల సమావేశంలో ఇంకా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..‘ పెద్ద చదువులు చదివితేనే పేదరికం నుంచి బయటపడతాం. గిరిజనులకు మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. గిరిజన సలహా మండలిని చంద్రబాబు మొన్నటిదాకా వేయలేదు. గిరిజన సలహా మండలితోనే బాబు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు. గిరిజనులను ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. మనం అధికారంలోకి రాగానే గిరిజనులకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తాం. అదికారంలోకి రాగానే బ్యాక్‌లాగ్‌ పోస్టులను  పూర్తి చేస్తాం. గిరిజన మహిళలకు 45 ఏళ్లకే రూ. 2 వేలు పెన్షన్‌ ఇస్తాం. అంతేకాక మంచి వైద్యం అందుబాటులో ఉంచుతాం. రూ. వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద పరిగణిస్తాం. దీర్ఘకాలిక రోగాలతో బాధ పడేవారికి నెలకు రూ. 10వేల పెన్షన్‌, ఎన్ని లక్షలు ఖర్చైనా పేద పిల్లలను చదివిస్తాం. మెస్‌, బోర్డింగ్‌ ఛార్జీలకు ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం.  చిన్నారులను బడికి పంపితే ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని’  వైఎస్‌ జగన్‌ చెప్పారు.

500 జనాభా ఉంటే గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని జననేత చెప్పారు. అంతేకాక ప్రతి పేదవాడికి భూములు పంచుతాం, పెట్టుబడి కింద ప్రతి మే నెలలో రూ. 12,500 ఇస్తామని తెలిపారు. పొల్లాల్లో ఉచితంగా బోర్లు కూడ వేయిస్తాం.. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల​ కాలేజీ, ఇంజినీరింగ్‌ కాలేజీ కట్టిస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top