జగనన్న మాట

 • Special Story On Christmas Celebration - Sakshi

  మనుషుల్ని చూడండి. మీద ఏదో ఒక బరువు. చదువుల బరువు. ఉద్యోగాల బరువు. ఇంటి పోషణ బరువు. బంధువుల మాటపట్టింపు బరువు. స్నేహితుల ముఖంచాటు బరువు. దగ్గరివాళ్లెవరి మనసునో నొప్పించిన బరువు. అంత బరువులోనూ సాటి మనిషి తల మీది బరువును రెండు చేతులతో చేపల గంపను కిందికి దింపినట్లుగా.. ‘కష్టాన్ని పంచుకునే బరువు’నూ పైకెత్తుకుంటారు! మనిషి ఎంత బరువును మోస్తున్నా.. మనిషి లోపల పంచుకోవడం అనే ఆ ‘ప్రేమ నక్షత్రం’ వెలుగుతున్నంత కాలం లోకం ప్రేమమయమే. కాంతిమయమే.

  మాధవ్‌ శింగరాజు
  మంచిని మోసుకొచ్చేవాళ్లు కనిపిస్తే మనసుకు భారం దిగినట్లుగా అనిపిస్తుంది. భుజాన అరటి గెలతో వచ్చేవాళ్లు, వడ్ల బస్తాల బండితో దిగేవాళ్లు, అమ్మాయికి పెళ్లి సంబంధం తెచ్చేవాళ్లు.. ఇవనే కాదు, ఊరికే చూసిపోదామని ఎంతోదూరం నుంచి ఒక పలకరింపునైనా మూట కట్టుకుని వచ్చేవాళ్లు.. వాళ్లు ఎండన పడి వచ్చినా.. మనకు నీడనిచ్చేందుకు వేర్లు పెకిలించుకుని కదలి వచ్చిన మనిషంత మహావృక్షంలా కనిపిస్తారు. మన నీరసాన్ని, నిస్సత్తువను పోగొడతారు. వాళ్లు తెచ్చిన చక్కెరకేళీలు, వాళ్లు దించిన ధాన్యం గింజలు, వాళ్లు చెప్పిన వరుడి విశేషాలు.. ఇవి కాదు మనసుకు సంతోషం. ఆ మోసుకురావడం.. అదీ!
  మనిషంటే అలానే ఉండాలి. నక్షత్రంలా! క్రీస్తు జన్మించారన్న కబురును ఇలాగే ఒక నక్షత్రం భూమి మీదకు మోసుకొచ్చింది.  ఆ నక్షత్రం ప్రసవించిన వెలుగులో క్రీస్తు జనన ఘడియలు కాంతిపుంజాలై ప్రసరించి లోకమంతటా మంచిని విత్తనాల్లా విరజిమ్మాయి. ఆ విత్తన సంతతే కావచ్చు ఈ మంచిని ప్రయాసపడి మోసుకొచ్చే మనుషులు! విరజిమ్మినప్పుడు మంచి అక్కడక్కడా పడింది కనుకనేనా మంచి మనుషులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు?! కాదు. కనిపించకపోవడానికి కారణం మనం చూడకపోవడం, చూడాలని మనకు లేకపోవడం! ప్రకృతిని చూసి పరవశిస్తాం.

  ప్రకృతిలో భాగమైన మూగజీవుల్ని చేరదీసి సేదతీరుతాం. పక్షులు పాడుతుంటే  వింటాం. మరి సాటి మనిషినెందుకు దగ్గరకు రానివ్వం? ఎన్ని యుగాల పరిచయం ఉన్నా  మనిషికి దగ్గరగా ఎందుకు వెళ్లలేం? చూడదలచుకుంటే దిగ్మండలంలోనే కాదు, ఈ భూమండలంలోనూ నక్షత్రాల్లాంటి మనుషులు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు జననం వంటి ఒక మంచిని వాళ్లు సాక్షాత్కరింపజేస్తారు. మనలో ప్రతి ఒక్కరం చూడగలం. అయితే చూడదలచుకోం! చూసేందుకు లోకంలో మంచే లేదనుకుంటాం. నిజంగానే లోకంలో మంచికి చోటు లేదా, మంచిని చూసేందుకు మనలో చోటు లేదా? ఉంటుంది. మంచిని చూడాలన్న ఆలోచన.. అది రాదు. వచ్చిందా.. మరుక్షణమే మన పక్కనే ఉన్న మనిషిలోనూ ఒక నక్షత్రం కనిపిస్తుంది! మనిషిలో నక్షత్రం కాదు, మనిషే నక్షత్రంలా కనిపిస్తారు. ఆ నక్షత్రపు వెలుగులో లోకంలోని మంచి కనిపిస్తుంది. వెలుగులో మంచొక్కటే కనిపిస్తుందా! వెలుగులో కనిపించేది మంచైనా, కానిదైనా.. మనసులోని వెలుగు మంచిని మాత్రమే చూస్తుంది. ఆ చూపును కాపాడుకోవాలి మనం. అప్పుడు లోకం దివ్యమైన నక్షత్ర కూటమిలా వెలుగుతూ కనిపిస్తుంది.

  శోకమయపు సముద్రాల ఈతకు నీటిపై సురక్షితంగా తేలియాడే ఆకులాంటి ఒక మంచి చూపు చాలదా.. సముద్రాన్ని, సుడిగుండాల్ని, తిమింగలాలను లక్ష్యపెట్టక ప్రశాంతంగా జీవనయానం సాగించడానికి! కొన్ని సంగతులు విన్నప్పుడు భూమి మీద ఉన్నదంతా ప్రేమ సందేశాలను మోసుకొచ్చే నక్షత్రాలే కానీ మానవమాత్రులు కారేమో అనిపిస్తుంది. కాకపోతే కొన్ని వెలిగే నక్షత్రాలు. కొన్ని వెలుగులో మాత్రమే కనిపించే నక్షత్రాలు. వెలుగులో నక్షత్రాలు కనిపించడం ఏమిటి! నక్షత్రమంటేనే వెలుగు కదా?! మనిషెంత వెలిగినా మంచితో వెలగడం ఒకటి ఉంటుందిగా. అలాంటిదే. ఒక యువకుడు ఉన్నాడు. హోటల్‌లో వెయిటర్‌. రూపాయి రూపాయి కూడ»ñ ట్టుకుని సైకిల్‌ కొనుక్కోవడం కోసం రోజూ పదకొండు కిలోమీటర్లు కాలి నడకన పనికి వచ్చి పోతున్నాడు.ఆ హోటల్‌కు  వస్తుండే దంపతులొకరికి ఈ సంగతి తెలిసింది.

  మర్నాడే ఒక సైకిల్‌ని కొని అతడికి కానుకగా ఇచ్చారు! కష్టపడటం అతడి వెలుగైతే, అతడి కష్టాన్ని ఆ దంపతులు గమనించడం అతడిపై ప్రసరించిన వెలుగు. ఒక పోలీస్‌ అధికారి బంద్‌ డ్యూటీలో ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. డ్యూటీలో ఉన్న చోటే ఒక అరుగు మీద భోజనానికి కూర్చోబోతుండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతడికి ఆకలిగా ఉన్నట్లు గ్రహించాడు ఆ పోలీస్‌ అధికారి. ‘తింటావా?’ అని అడిగాడు. ‘తింటాను’ అన్నట్లు తలూపాడు ఇల్లూ వాకిలీ లేని ఆ వ్యక్తి. పోలీస్‌ అధికారి తెప్పించుకున్న అన్నం పొట్లంలోనే ఇద్దరూ కలిసి చేతులు పెట్టి భోజనం చేశారు! పంచే బుద్ధి పోలీస్‌ ఆఫీసర్‌లోని వెలుగైతే, దాన్ని బయటికి కనిపించేలా చేసిన వెలుగు ఆ ఆకలిగొన్న వ్యక్తి. ఇలాంటివి జరక్కపోతే పోలీసు చొక్కాపై నక్షత్రాలను తప్ప పోలీసు మనసు లోపలి నక్షత్రాలను చూడగలమా?! మనుషుల్లోపల్లోపల సాటి మనుషులంటే ఇంతింత ప్రేమ ఉంటుందే.. మరి అదంతా కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడీ పోదు.

  ఎక్కడి నుంచో, ఏ రూపంలోనో ఓ కాంతి ధార వచ్చి పడితేనే కానీ ఆ మానవ నక్షత్రాల్లోని ప్రేమ వెలుగు పైకి కనిపించదు. మనుషులు ధరించే నిర్దయ, నిరాదరణ అనే కవచాలు మనుషుల మీద అనుమానంతోనే కానీ అవేవీ సహజ కవచాలు, కుండలాలు కావు. సాటి మనిషి అవసరానికి అవి తునాతునకలైపోయి హృదయకాంతి బయపడినప్పుడు గానీ అప్పటి వరకు వారు పండ్ల గెలలు, ధాన్యపు బస్తాలు, పెళ్లి సంబంధాలు మోస్తున్నట్లు తెలియదు. జ్ఞానులు సైతం క్రీస్తు జననాన్ని నక్షత్రం ద్వారానే గుర్తించగలిగారు. మనిషిలోని దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి మనిషీ అంతటి నక్షత్రం అయి ఆ కాంతిని లోకానికి బాటగా వేయాలి.  

  తాతకు తోడుగా..!

  క్రిస్మస్‌ తాత నివాసం దక్షిణధ్రువంలో ఉంటుందని ప్రపంచం అంతా భావిస్తుంటే.. నెదర్లాండ్స్‌ ప్రజలు మాత్రం ఆయన స్పెయిన్‌ దేశంలో ఉంటాడని నమ్ముతారు. క్రిస్మస్‌ తాతను ఇంగ్లిషులో శాంటాక్లాస్‌ అంటాం కదా. శాంటాక్లాస్‌ అన్నది నెదర్లాండ్స్‌ వాళ్లు మాట్లాడే డచ్‌ భాషా పదం. వాళ్ల దేశం నుంచి శాంటాక్లాస్‌ అనే మాట వచ్చింది కాబట్టి, శాంటాక్లాస్‌ది స్పెయిన్‌ అని చెబుతున్న డచ్‌వాళ్ల మాటను మనం పూర్తిగా కాదనేందుకు లేదు. డచ్‌వాళ్లకు ఇంకో నమ్మకం కూడా ఉంది. క్రిస్మస్‌ గిఫ్టులు ఇవ్వడానికి శాంటాక్లాజ్‌ ఒక్కడే వస్తాడని మనం అనుకుంటాం. కానీ కాదట. ఆయన పక్కన ఆయనకు సహాయకులుగా కొన్ని ‘పిల్ల శాంటాలు’ ఉంటారట. వాళ్లేం చేస్తారంటే.. గిఫ్టులు ఇవ్వడానికి క్రిస్మస్‌తాతతో పాటు ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలెవరైనా తుంటరి పనులు చేస్తే వాళ్లను అమాంతం ఎత్తుకుని తెచ్చేసి స్పెయిన్‌లో వదిలేస్తారట! అంతకుమించిన శిక్ష ఉండదని నెదర్లాండ్స్‌ వాళ్లు అంటారు!

  బాల యేసుకు దుప్పటి

  రాత్రి పెట్టిన క్రిస్మస్‌ చెట్టు మీద తెల్లారే సాలెగూడు కనిపిస్తే ఏదో అదృష్టం వరించబోతోందని జర్మనీ, పోలండ్, ఉక్రెయిన్‌ దేశాలలో ఒక విశ్వాసం ఉంది. బేబీ జీసెస్‌ కోసం ఆ సాలె పురుగు దుప్పటి నేస్తూ ఉంటుందని కొందరి నమ్మకం. ఆ సాలెగూడు ఉదయాన్నే సూర్య కిరణాలు సోకి బంగారు, వెండి సాలెగూడుగా మారిపోతుందని మరికొందరి నమ్మకం. మన దగ్గర మార్కెట్‌ నుంచి కొని తెచ్చుకున్న రెడీమేడ్‌ క్రిస్మస్‌ ట్రీలో ఏ మూలో సాలెగూడు కూడా ఉండటానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. ఈ నమ్మకం గురించి తెలిసినవాళ్లు క్రిస్మస్‌ చెట్టుకు తప్పని సరిగా ఒక ప్లాస్టిక్‌ సాలెగూడును సంపాదించి తగిలిస్తారు. అలా కూడా అదృష్టం కలసి వస్తుందని కొందరు విశ్వసిస్తారు.

  పసి మనసులు

  కొన్ని పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా జర్మనీలో ఒక అందమైన విశ్వాసం ఉంది. క్రిస్మస్‌కు కొద్ది గంటల ముందు.. కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన పసి హృదయాలు జంతువుల మాటల్ని వినగలుగుతాయట! అంతేకాదు, నదులు ద్రాక్ష సారాయిగా మారడాన్ని ఆ పసివాళ్ల కళ్లు చూడగలుగుతాయి. క్రిస్మస్‌ ట్రీకి వాళ్ల కళ్లముందే తియ్యటి బేరీ పండ్లు కాస్తాయి. పర్వతాలు తెరుచుకుని వాటి గర్భంలోని మణులు మాణిక్యాలు బయటపడతాయి. సముద్రపు అడుగునుంచి దేవుని గంటలు ధ్వనిస్తాయి. నిజంగా ఇలా జరిగితే ఎంతమందిమి చూడగలుగుతాం? మనలో ఎన్ని పవిత్రమైన హృదయాలు ఉంటాయి అని ప్రశ్న?!

  గంటకు 60 లక్షల మైళ్లు!

  క్రిస్మస్‌తాత తెచ్చే గిఫ్టుల కోసం ఎదురు చూసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. మరి వారందరికీ గిఫ్టులు చేరవెయ్యాలంటే క్రిస్మస్‌ తాతకు టైమ్‌ సరిపోతుందా? సరిపోతుంది. గంటకు అరవై లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తే చాలు. అన్ని దేశాల్లోని అందరి పిల్లలకు గిఫ్టులు అందినట్లే. యు.ఎస్‌.లోని యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఒకరు వేసిన లెక్క ఇది.

  ఎక్స్‌మస్‌

  క్రిస్మస్‌ని ఎక్స్‌మస్‌ అని కూడా అంటుంటాం. ఎందుకిలా? ఎప్పుడైనా మీకు డౌట్‌ వచ్చిందా? మీకు వచ్చినా రాకున్నా ఎక్స్‌మస్‌ అన్నది మాత్రం క్రిస్మస్‌ నుంచే వచ్చింది. అబ్రివేషన్‌గా వాడుతున్నాం. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడితే సరిపోయిందా? లాజిక్‌ ఉండొద్దా? ఉంది! గ్రీకు భాషలో ఛిజిజీ ని గీ తో సంకేతపరుస్తారు. అందుకే క్రైస్ట్, క్రిస్టోస్‌ అనే మాటలకు ముందు వాళ్లు గీ అని రాస్తారు. అలా క్రిస్మస్‌.. ఎక్స్‌మస్‌ అయింది.

  బాతు చెట్లు

  మొదట్లో క్రిస్మస్‌ చెట్టును బాతు ఈకలతో చేసేవాళ్లు. ఆ ఈకలకు పచ్చరంగు వేసేవారు. 19వ శతాబ్దంలో జర్మనీలో ఇలా చేయడం మొదలైంది. అప్పట్లో అక్కడ అడవుల నరికివేత విపరీతంగా ఉండటంతో చెట్లకు కరువొచ్చింది. దాంతో బాతు ఈకల ఆలోచన వచ్చింది వాళ్లకు. తర్వాత్తర్వాత బాతు ఈకలతో క్రిస్మస్‌ చెట్లను తయారు చేయడమన్నది అమెరికాకు, ఇతర దేశాలకూ వ్యాపించింది.

  కెంటకీ ఫర్‌ క్రిస్మస్‌

  జపాన్‌లో క్రిస్మస్‌ రోజు కె.ఎఫ్‌.సి.లు కిటకిటలాడిపోతుంటాయి. అక్కడ క్రైస్తవుల సంఖ్య పెద్దగా ఉండదు కానీ, క్రిస్మస్‌ రోజు అంతా కె.ఎఫ్‌.సి.ల దారి పడతారు. కె.ఎఫ్‌.సి. అంటే కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌. అయితే 1947లో కె.ఎఫ్‌.సి. తన సేల్స్‌ పెంచుకోవడం కోసం ‘కెంటకీ ఫర్‌ క్రిస్మస్‌’ అనే మార్కెటింగ్‌ వ్యూహం పన్ని  సక్సెస్‌ అయ్యింది. అప్పట్నుంచీ క్రిస్మస్‌ సీజన్‌లో జపాన్‌వారికి పండగే పండుగ. కె.ఎఫ్‌.సి. వారి నోరూరించే ఆఫర్లు కడుపునిండా ఉంటాయి.

 • Special Story On Christmas Celebration - Sakshi

  తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్‌’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్‌!!  

  దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు  క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు.

  పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది.   మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ  అనే జీవనదులు పొంగి పారుతున్నాయి.

  చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన  దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు.

  చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్‌’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట  పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్‌!!  
  – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

 • Christmas celebrations Customs And Traditions - Sakshi

  ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్‌. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్‌ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్‌కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి.

  క్రిస్మస్‌ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. 
  క్రిస్మస్‌ చెట్టుకు క్రిస్మస్‌ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్‌ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తి‍కి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే  క్రిస్మస్‌ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు  ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు.

  ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల​ నాన్నతో క్రిస్మస్‌ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్‌కు  పిల్లలందరూ క్రిస్మస్‌ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్‌ తాత వచ్చి వాటిలో క్రిస్మస్‌ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్‌ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది.

  జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్‌ కార్డులు: 
  1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్‌ హెన్నీ కోల్‌ తన బంధు మిత్రులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్‌ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన.


  ఎప్పటికీ ఎండిపోని ఫిర్‌ చెట్టు(క్రిస్మస్‌ ట్రీ)..
  క్రిస్మస్‌ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్‌ చెట్టును క్రిస్మస్‌ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్‌ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్‌ ట్రీ డిమాండ్‌ పెరిగింది. అనంతరం జర్మన్‌ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది.

  చైనాలో అతిపెద్ద క్రిస్మస్‌ సిజన్‌ షాపింగ్‌ : 
  క్రిస్మస్‌ సీజన్‌లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్‌ సీజన్‌ క్రిస్మస్‌ ముందు రోజే. క్రిస్మస్‌ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్‌ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్‌ భాషలో యాపిల్‌ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్‌ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.  ముందు రోజు ఉపవాసం:
  క్రిస్మస్‌ ముందు రోజైన డిసెంబర్‌ 24న రష్యన్‌ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్‌. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు.

  - స్నేహలత (వెబ్ డెస్క్)

 • Christmas Star Specialty And celebrations - Sakshi

  సాక్షి, నాగార్జునసాగర్‌(నల్గొండ) : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఇంటింటికీ పైభాగాన క్రిస్మస్‌ స్టార్‌ను అమర్చుతారు. సెమి క్రిస్మస్‌ నుంచి ఈ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తారు. బుధవారం క్రిస్మస్‌ పండుగ ఉండటంతో నందికొండ మున్సిపాలిటీ కాలనీల్లో ఉన్న అన్ని ప్రముఖ ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్‌ స్టార్స్‌ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా దీనిని భావిస్తారు.

  క్రిస్మస్‌ సార్స్‌ ప్రాధాన్యత...
  క్రిస్మస్‌ స్టార్స్‌ గురించి పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది. మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది. ఆకాశంలో ఏదైన కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు. ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఏసును కనుగొన్నారు.

  ఈ విధంగా పలుప్రాంతాలకు చెందిన వారు జగతి మేలుకోసం జన్మించిన ఏసుకు కానుకలుగా బంగారం, సాంబ్రాణి, సుగంధ పరిమళాలతో కూడిన బోళమును సమర్పించారు. అప్పటినుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడింది. క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా అందరూ తమ ఇళ్లల్లో క్రిస్మస్‌ స్టార్స్‌ ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్‌కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఉంచుతారు. 

  క్రిస్మస్‌ను తెలియజేస్తుంది
  క్రిస్మస్‌ పండుగకు ముందు క్రైస్తవులందరూ తమ ఇళ్లల్లో స్టార్స్‌ను ఉంచుతారు. అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఈ క్రిస్మస్‌ పండుగను జరుపుకుంటాం.
  – డి.కోటేశ్వర్‌రావు, సాగర్‌

  అధిక సంఖ్యలో ఆరాధించే దేవుడు క్రీస్తు 
  అధికసంఖ్యలో ఆరాధించే దైవం ఏసు క్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రిస్మస్‌ స్టార్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇంటి ఎదుట క్రిస్మస్‌స్టార్‌ను అలంకరించగానే ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుంది.
  – విజయప్రభావతి, హిల్‌కాలనీ 

 • Khammam Famous Churches And Christmas Celabrations - Sakshi

  రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్‌ఐ
  కొత్తగూడెంటౌన్‌: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్‌ ఆండ్రూస్‌ సీఎస్‌ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్‌ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్‌ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్‌ సెంటర్‌లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. 

  వేడుకలకు సిద్ధం చేశాం..
  ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్‌ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు. 
  – టి.జాన్సన్, సీఎస్‌ఐ చర్చి చైర్మన్‌ 

  కరుణగిరి..
  ఖమ్మంరూరల్‌: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం. 

  లివింగ్‌ గాస్పెల్‌ చర్చి..
  పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్‌ కాలనీలో ఉన్న లివింగ్‌ గాస్పెల్‌ చర్చ్‌ (ఎల్‌జీఎం) ఇండిపెండెంట్‌ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్‌ లిటిల్‌ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్‌ గాస్పెల్‌ చర్చిని బాపూజీ నగర్‌లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్‌ దేవసహాయం కుమారుడు సాధు టైటస్‌ లివింగ్‌ వాటర్‌ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్‌ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్‌ లివింగ్‌ వాటర్‌ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. 

  యేసు ప్రేమను చాటడమే లక్ష్యం
  యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం.
  – సాధు టైటస్‌ లివింగ్‌ వాటర్, పాస్టర్‌

  అద్భుతం..లూర్థుమాత ఆలయం
  తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్‌ కేథలిక్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. 

  క్రిస్మస్‌ అంటే క్రీస్తు ఆరాధనే..
  బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్‌. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. 
  – పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ 

  ఆకట్టుకునే ఆర్‌సీఎం
  పాల్వంచ: స్థానిక ఆర్‌సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్‌ ఆర్ట్‌ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్‌ అనే ఆర్కిటెక్ట్‌ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్‌ బెనడిక్ట్‌ ఆధ్వర్యంలో 2013 జూన్‌ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి. 

  తెల్లవారేదాకా ప్రార్థనలు
  24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె  ల్లవారుజాముదాకా..క్రిస్మస్‌ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్‌ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం.
   – ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ

Back to Top