
యువకులపై విరుచుకుపడుతున్న మంత్రి గన్‌మెన్, యువకులు, తెలుగు తమ్ముళ్ల మధ్య తోపులాటలు
గన్‌మెన్ అత్యుత్సాహం.. కేసులు పెడతామంటూ బెదిరింపులు
పశ్చిమగోదావరి, ఆచంట: రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాదయాత్ర శుక్రవారం పెదమల్లంలో రసాభాసగా మారింది. సమస్యలపై మంత్రి పితానిని యువకులు నిలదీయడంతో వారికి, తెలుగు తమ్ముళ్లకు వాగ్వివాదం, స్వల్ప తోపులాట జరిగాయి. పితాని గన్‌మెన్ బెదిరింపులతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజుల నుంచి మంత్రి పితాని సత్యనారాయణ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ఆచంట మండలం పెదమల్లంలో పర్యటించారు.
మంత్రి పాదయాత్ర జరుగుతున్న సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యువకులు గ్రామ సమస్యలను మైక్ ద్వారా విన్నవించసాగారు. గ్రామంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లకు, యువకులకు మధ్య వాగ్వివాదం మొదలైంది. ఇది తారాస్థాయికి చేరుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి, మంత్రికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. దీంతో మంత్రి గన్‌మెన్ ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. యువకులపై విరచుకుపడ్డారు. కేసులు పెడతామంటూ హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొడవర్తి శ్రీరాములు కలుగజేసుకుని గన్‌మెన్‌ను పక్కకు తీసుకెళ్లారు. గన్‌మెన్ దురుసు ప్రవర్తన, మాట తీరుపై యువకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
మీరు మా గ్రామానికి ఏమి చేశారు?
గ్రామంలో పాదయాత్ర చేసుకుని íగ్రామదేవతల ఆలయాల సమీపంలోకి వచ్చే సరికి యువకులు మంత్రి పితానిని అడ్డుకునే యత్నం చేశారు. యువకుల ఆగ్రహావేశాలు గమనించిన పితాని ‘మీ సమస్యలు ఏమిటి’ అని ప్రశ్నించారు. దీనికి ‘మీరు మా గ్రామానికి ఏమి చేశారు’ అని యువకులు ఎదురు పశ్నించారు. ‘ఏం చేయలేదు’ అంటూ మంత్రి ఎదురు ప్రశించగా ఏమీ చేయలేదని యువకులు సమాధానం చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. మీ నాయకులు(జగన్, పవన్‌లను ఉద్దేశించి) వచ్చిన తర్వాత పనులు చేయించుకోండి అంటూ సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిన తర్వాత పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.