pithani sathya narayana
-
పాదయాత్రలో పితానికి ఝలక్
పశ్చిమగోదావరి, ఆచంట: రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాదయాత్ర శుక్రవారం పెదమల్లంలో రసాభాసగా మారింది. సమస్యలపై మంత్రి పితానిని యువకులు నిలదీయడంతో వారికి, తెలుగు తమ్ముళ్లకు వాగ్వివాదం, స్వల్ప తోపులాట జరిగాయి. పితాని గన్‌మెన్ బెదిరింపులతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజుల నుంచి మంత్రి పితాని సత్యనారాయణ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ఆచంట మండలం పెదమల్లంలో పర్యటించారు. మంత్రి పాదయాత్ర జరుగుతున్న సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యువకులు గ్రామ సమస్యలను మైక్ ద్వారా విన్నవించసాగారు. గ్రామంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లకు, యువకులకు మధ్య వాగ్వివాదం మొదలైంది. ఇది తారాస్థాయికి చేరుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి, మంత్రికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. దీంతో మంత్రి గన్‌మెన్ ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. యువకులపై విరచుకుపడ్డారు. కేసులు పెడతామంటూ హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొడవర్తి శ్రీరాములు కలుగజేసుకుని గన్‌మెన్‌ను పక్కకు తీసుకెళ్లారు. గన్‌మెన్ దురుసు ప్రవర్తన, మాట తీరుపై యువకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి ఏమి చేశారు? గ్రామంలో పాదయాత్ర చేసుకుని íగ్రామదేవతల ఆలయాల సమీపంలోకి వచ్చే సరికి యువకులు మంత్రి పితానిని అడ్డుకునే యత్నం చేశారు. యువకుల ఆగ్రహావేశాలు గమనించిన పితాని ‘మీ సమస్యలు ఏమిటి’ అని ప్రశ్నించారు. దీనికి ‘మీరు మా గ్రామానికి ఏమి చేశారు’ అని యువకులు ఎదురు పశ్నించారు. ‘ఏం చేయలేదు’ అంటూ మంత్రి ఎదురు ప్రశించగా ఏమీ చేయలేదని యువకులు సమాధానం చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. మీ నాయకులు(జగన్, పవన్‌లను ఉద్దేశించి) వచ్చిన తర్వాత పనులు చేయించుకోండి అంటూ సమాధానం దాటవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిన తర్వాత పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. -
బాబును కాంగ్రెస్‌తో కలవమని చెప్పింది నేనే
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబుకు చెప్పింది తానేనని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సభ్యులకు ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ పార్టీ తరఫున నెగ్గి, మరో పార్టీలోకి ఫిరాయించిన వారిని ఓడించాలంటూ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బాలకృష్ణ పిలుపు నిచ్చారని, అది మన రాష్ట్రంలో కూడా వర్తిస్తుందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ రాజకీయాల్లో విలువలు తగ్గాయన్నారు. పార్టీలు మారుతున్నా సరే ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎవరి వివేచనకు వారే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ఇది ప్రజాస్వామ్య దేశమని, కేంద్ర, రాష్ట్రం అని చూడకూడదన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రం వాటా కూడా ఉందన్న విషయం మర్చిపోకూడదన్నారు. చంద్రన్న బీమా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం స్కీంలో వయసును బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా బీమా చెల్లిస్తారని, అయితే చంద్రన్న బీమాలో అందరికీ రూ. 5 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకం ద్వారా రూ 2 కోట్లు 57లక్షల 70 వేల మంది సభ్యుత్వం పొందారని తెలిపారు. కాంగ్రెస్ తో జతకట్టడం గురించి అడిగిన ప్రశ్నకు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జల, వాయు కాలుష్యాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సభ్యులైన 176 మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకం కార్డులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకుడు జి.మనోరంజన్, ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, సీనియర్ పాత్రికేయుడు కృష్ణకుమార్, సాక్షి డెస్క్ ఇన్చార్జి కృష్ణారావు, ఎస్ఎస్ చారి, టి. శ్రీనివాస్,పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో సీఎం, నేను రాజీనామా చేస్తున్నాం: పితాని
యలమంచిలి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెలలో రాజీనామా చేసేందుకు ముహూర్తం నిర్ణరుుంచుకున్నారని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పితాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ వచ్చే నెలలో రాజీనామా చేస్తారని, ఆ వెంటనే తాను కూడా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. విభజనకు అనుకూలంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లేఖలు ఇచ్చినందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. అయితే సీమాంధ్రలో ఉద్యమం వెల్లువెత్తడంతో మిగిలిన పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నెపం కాంగ్రెస్ పార్టీపై పడిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తామం తా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. ఆ దిశగానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్టు పితాని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ‘సమైక్య’ ముద్రకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం.. తన సన్నిహిత మంత్రి పితాని నోటివెంట ఈ మాటలు చెప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం.