
పార్టీలు మారుతున్నా సరే ప్రజలు పట్టించుకోవడం లేదు..
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబుకు చెప్పింది తానేనని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సభ్యులకు ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ పార్టీ తరఫున నెగ్గి, మరో పార్టీలోకి ఫిరాయించిన వారిని ఓడించాలంటూ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బాలకృష్ణ పిలుపు నిచ్చారని, అది మన రాష్ట్రంలో కూడా వర్తిస్తుందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ రాజకీయాల్లో విలువలు తగ్గాయన్నారు. పార్టీలు మారుతున్నా సరే ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎవరి వివేచనకు వారే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ఇది ప్రజాస్వామ్య దేశమని, కేంద్ర, రాష్ట్రం అని చూడకూడదన్నారు.
కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రం వాటా కూడా ఉందన్న విషయం మర్చిపోకూడదన్నారు. చంద్రన్న బీమా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం స్కీంలో వయసును బట్టి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా బీమా చెల్లిస్తారని, అయితే చంద్రన్న బీమాలో అందరికీ రూ. 5 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకం ద్వారా రూ 2 కోట్లు 57లక్షల 70 వేల మంది సభ్యుత్వం పొందారని తెలిపారు. కాంగ్రెస్ తో జతకట్టడం గురించి అడిగిన ప్రశ్నకు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా చెప్పిందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఎన్‌టీఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జల, వాయు కాలుష్యాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సభ్యులైన 176 మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకం కార్డులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకుడు జి.మనోరంజన్, ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, సీనియర్ పాత్రికేయుడు కృష్ణకుమార్, సాక్షి డెస్క్ ఇన్‌చార్జి కృష్ణారావు, ఎస్‌ఎస్ చారి, టి. శ్రీనివాస్,పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.