వందసీట్లు దాటేందుకు తండ్లాడుతున్నారు.. నైతిక విజయం మాదే! | Sakshi
Sakshi News home page

నైతిక విజయం మాదే: కాంగ్రెస్‌

Published Mon, Dec 18 2017 4:34 PM

Whatever the results, it was moral win for Congress, says Ashok Gehlot - Sakshi

న్యూఢిల్లీ: అత్యంత హోరాహోరీగా జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు క్రమంగా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆంతర్మథనం కొనసాగుతోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఓడిపోయినప్పటికీ.. బీజేపీకి గట్టిపోటీనివ్వడంపై ఆ పార్టీ నేతల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్న భావనను కాంగ్రెస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో, ఆయన తీవ్రంగా ప్రచారం చేసినా.. బీజేపీ 100 సీట్లు దాటడానికి నానా తంటాలు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

 గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై పార్టీ అంతర్గత విశ్లేషన అనంతరం కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌ ఫలితాలు ఎలా ఉన్నా  నైతిక విజయం తమదేనని ఆయన పేర్కొన్నారు. ‘ఫలితాలు ఎలా ఉన్నా నైతిక విజయం కాంగ్రెస్‌దే. రాహుల్‌గాంధీ సాగించిన అంశాల వారీ ప్రచారానికి దక్కిన విజయమిది. ప్రధాని మోదీ, అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ 100 సీట్లను దాటడానికి తండ్లాడుతోంది’ అని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ‘గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ చాలామంచి ప్రచారాన్ని నిర్వహించింది. రాహుల్‌ ప్రచారం సాగించిన తీరు ఇందిరాగాంధీని తలపించింది’ అని ఆయన అన్నారు.

ప్రజాతీర్పును అంగీకరిస్తున్నాం: రాహుల్‌గాంధీ
‘ప్రజాతీర్పును కాంగ్రెస్‌ పార్టీ అంగీకరిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలకు అభినందనలు. నాపై చూపిన అమితమైన ప్రేమానురాగాలకు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు’ అని రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

1/1

మీడియాతో మాట్లాడిన అశోక్‌ గెహ్లాట్‌

Advertisement
Advertisement