
కాకినాడ/సాక్షి, అమరావతి: ఆత్మగౌరవ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్ల తో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు. నూరు శాతం ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ గల జిల్లాగా తూర్పుగోదావరిని సీఎం ప్రకటించారు.
వలయంగా ఉండి నన్ను కాపాడండి!
‘కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. వలయంగా మారి నన్ను కాపాడండి’అని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పదేపదే తనపై ఏదో కుట్ర జరగబోతోందంటూ అభద్రతా భావంతో పలు వ్యాఖ్యలు చేశారు. తనకు మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉద్యమిస్తానని.. తనను కాపాడే బాధ్యత మాత్రం మీరే తీసుకోవాలని ప్రజలను సీఎం కోరారు. ఇన్నాళ్లూ టీడీపీతో కలిసి ఉన్న పవన్‌కల్యాణ్ ఇప్పుడు తనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమే వెనకుండి ఆడిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.