లా అండ్‌ ఆర్డర్‌ తప్పినా సమీక్షించకూడదా?

Voting Percentage Increased By My Call Says Chandrababu - Sakshi

ఈసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు

మోదీ కోసమో, ఇంకొకరి కోసమో పని చేయొద్దు

వీవీ ప్యాట్లను లెక్కించడానికి ఇబ్బంది ఏంటి?

నా పిలుపుతోనే ఓటింగ్‌ శాతం పెరిగింది

తిరుపతి (అలిపిరి) : రాష్ట్రంలో లా అండ్‌ అర్డర్‌ తప్పినా ప్రభుత్వం రివ్యూ చేయకూడదని ఈసీ ఆంక్షలు విధించడం ఏమిటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌పై తనకు ఎటువంటి ఆక్రోశం లేదని, అది అవలంబిస్తున్న విధానాలపై మాత్రం రాజీలేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తిరుపతిలో శనివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. తిరుపతి సభ సాక్షిగా రాష్ట్రానికి విభజన హామీతో పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. వీవీ ప్యాట్, ఈవీఎంలను పరిశీలించాలన్నారు. వీవీ ప్యాట్‌లను లెక్కించడానికి ఈసీకి ఇబ్బందేంటో అర్థం కావడం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దని, మోది కోసమో, ఇంకొకరి కోసమో పని చేయడం ఏమిటని మండిపడ్డారు. ఓటింగ్‌ శాతం తగ్గించడానికి కొందరు రౌడీయిజం చేసి భయంకర వాతావరణం సృష్టించారన్నారు. తన పిలుపుతోనే రాష్ట్ర ప్రజలు ముందుకు వచ్చి అర్ధరాత్రి వరకు ఓటింగ్‌లో పాల్గొన్నారని, మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 

మోదీ సమీక్ష నిర్వహిస్తే పట్టించుకోలేదు..
తిరుపతితో పాటు 4 వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడితే సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే తాను ఫాలో అవుతానని, కేవలం రాష్ట్రంలో తమపై మాత్రమే ఆంక్షలు విధిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. మోదీ రివ్యూ నిర్వహిస్తే పట్టించుకోలేదని, ఇతర రాష్ట్రాల్లో హెలికాప్టర్‌ల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేసినా పట్టించుకోని ఈసీ, ఏపీపై మాత్రమే ఆంక్షలు విధించిందన్నారు. మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఫొటో తీసినందుకు ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేశారన్నారు. సస్పెండ్‌ చేసే అధికారం ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 65 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌లు ఎన్నికల కమిషన్‌ విధానాలను వ్యతిరేకించి తనకు సపోర్ట్‌ చేయకుండా ఇంకోవిధంగా వ్యవహరించి కుల ప్రాతిపదికన పని చేశారని మండిపడ్డారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని 23 రాజకీయ పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో డిమాండ్‌ చేశామన్నారు. ఎన్నికల ఫలితాలు రాకమునుపే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం బోర్డు రాయించుకున్నారని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ ఇంటికి పోవడం ఖాయమని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుందని, ఓటింగ్‌ తగ్గించాలని ప్రయత్నించిందని చెప్పారు. రాష్ట్రంలో ఆంక్షలు విధించడానికి మోదీ, కేసీఆర్, జగన్‌ కుట్రలే కారణమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top