జేడీగారూ.. తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి..

Vijaya Sai Reddy Counter Tweets to Ex-CBI JD lakshmi narayana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ‘జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్  బీ ఫారాలు ‘పోగొట్టుకున్నట్టు’ గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి. పాపం! బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం మీకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా జేడీ గారూ?. ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారు. మీ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు. 

హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌ (హెచ్‌ఎంవీ) (His Master's Voice (HMV)) అన్న బిరుదు మీకు చక్కగా సరిపోతుంది జేడీ గారూ. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, మీ బాస్ చెప్పినట్టు ఆఖరి క్షణంలో జనసేనలో చేరారు. మీ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందే.  ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి. జేడీ గారూ, మీ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుంది. ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’  ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది.

‘లక్ష్మీనారాయణ గారూ మీరు ఈ రోజుకూ జేడీనే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి-జనసేనకు జాయింట్ డైరెక్టర్!. నేరగాళ్ళ పార్టీకి, విలువల్లేని పార్టీకి తమరే సంయుక్త సంచాలకులు!. మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి.. నెల క్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి...ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరఫున విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు! అహా  ఏమి ప్రజాస్వామిక విలువలు? ఏమి రాజకీయ విలువలు?. మీ టిక్కెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే. తీర్థం (బీఫామ్ మీద సంతకం) జనసేనది. ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు. కాదు మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం!.’ అంటూ విజయసాయి రెడ్డి వరుసపెట్టి ట్విట్లు చేశారు.’ అంటూ విజయసాయి రెడ్డి శనివారం వరుసపెట్టి ట్విట్లు చేశారు.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top