
సాక్షి, గుంటూరు: మద్య నిషేధాన్ని స్వాగతించాల్సినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యానికి బానిసలయ్యేలా జనాలను రెచ్చగొడుతున్నారని మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా మారారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢసంకల్సంతో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 20 శాతంపైగా మద్యం వినియోగాన్ని తగ్గించారన్నారు. మద్య వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారు.. కానీ చంద్రబాబు మాత్రం మద్యం తగ్గటంపై బాధపడుతున్నారన్నారు. జనాన్ని తాగుబోతులుగా మార్చాలని చూడటం అనైతికమన్నారు, ప్రస్తుత విధానాలతో ప్రజలు సుఖంగా ఉన్నారని, దీన్ని కూడా రాజకీయంగా చూడటం బాబుకే చెల్లిందని ఆయన విమర్శించారు.