కొన్నాళ్లే కాంగ్రెస్‌–జేడీఎస్‌ సర్కారు

unholy alliances unlikely to last long - Sakshi

అమిత్‌ షా

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ అపవిత్ర పొత్తుతో ఏర్పాటైన ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించబోదని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ యత్నించిందన్న ఆరోపణలను షా ఖండించారు. శనివారం ఢిల్లీలో  నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. ప్రధానిపై రాహుల్‌ ‘అవినీతి’ ఆరోపణల్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన జేడీఎస్‌.. ఎన్నికల తర్వాత ఆదేపార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు.

‘ఈ సంకీర్ణం నిలవదు’
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ల అపవిత్ర బంధంతో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదని కేంద్రం మంత్రి అనంత్‌ కుమార్‌ అన్నారు. బీజేపీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదన్నారు. తామిచ్చిన హామీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారన్నారు. కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజలకు వివరించటంలో బీజేపీ శ్రేణులు ఒక్క నిమిషం కూడా వృథా చేయబోవన్నారు. బీజేపీని అడ్డుకోవాలనే ఏకైక నెపంతో 78మంది సభ్యులున్న కాంగ్రెస్‌.. కేవలం 38 మంది సభ్యుల జేడీఎస్‌ కాళ్ల వద్ద సాగిలపడటం సిగ్గుచేటని విమర్శించారు.
ఎమ్మెల్యేలను కొంటే

గెలిచేవాళ్లం కదా: జవదేకర్‌
బొమ్మనహళ్లి: కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా ఉండేందుకే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా యడ్యూరప్ప గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘రాష్ట్రంలో బీజేపి కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. మేం ఎక్కడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదు. అలా చేసి ఉంటే ఈరోజు బలపరీక్షలో విజయం సాధించేవాళ్లం కదా’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలకు తమకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని జవదేకర్‌ పేర్కొన్నారు. విధానసభలో తాము ఓడిపోలేదనీ, నైతిక విజయం తమదేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలముందు బీజేపీ–జేడీఎస్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఏ ముఖంతో జేడీఎస్‌తో పొత్తుకు వెళ్లారని ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top