‘ప్రాదేశికం’పై గులాబీ గురి

TRS Leaders Focus On ZPTC And MPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నోటిఫికేషన్‌ విడుదలకు ముందే ఉమ్మడి జిల్లాలో ‘ప్రాదేశిక’ ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు వారం రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సన్నాహాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తి.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై గెలుపు ధీమాతో ఉన్న గులాబీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు జెడ్పీ చైర్మన్‌ పదవులపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈనెల 13న స్థానిక జేజేఆర్‌ గార్డెన్స్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈనెల 15న హైదరాబాద్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశమై గెలుపు వ్యూహాలపై సలహాలు, సూచనలు చేశారు.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం.. అనుసరించాల్సిన వ్యూహాలు..తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలతోపాటు స్థానిక, జిల్లా నేతల మధ్య సమన్వయం కోసం ఐదు జిల్లా పరిషత్‌లకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్, నారాయణపేట; వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి వనపర్తి, జోగుళాంబ గద్వాల; ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ నుంచి పార్టీ తరఫున పోటీ చేసిన పోతుగంటి రాములుకు అదే జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.

పోటెత్తుతున్న ఆశావహులు
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఆయా ఎమ్మెల్యేలకే అప్పగించిన విషయం విదితమే. పార్టీ విధేయులు, ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉన్న వారిని గుర్తించి వారికే బీ–ఫారాలు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా చూడాల్సిన పూర్తి భారం ఎమ్మెల్యేలపై పడింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు క్యూ కడుతున్నారు.

గ్రామాల్లో గులాబీ గాలి వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు పెద్ద సంఖ్యలో కారెక్కారు. ఆ తర్వాత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహించారు. తాజాగా ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వీరు తమను గుర్తిస్తారనే ధీమాతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఎమ్మెల్యేలకు సవాలుగా మారింది. ఒక్కో గ్రామం, మండలంలో భారీ పోటీ నెలకొనడంతో ఎవరికి బీ–ఫారం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆశావహులు అభ్యర్థిత్వాల ఖరారు కోసం ఎమ్మెల్యేలను ప్రాధేయపడుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత రాజకీయం మరింత వేడెక్కనుంది.

గెలుపు ధీమాలో పార్టీ శ్రేణులు 
ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ శ్రేణులు ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుపు ధీమాతో ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ, ప్రాదేశిక ఎన్నికల తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీలు వీడి గులాబీ కండువా కప్పుకొన్నారు.

ప్రస్తుతమున్న స్థానాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉండడమూ తమకు కలిసొచ్చే అంశంగా గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతోపాటు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే తమ గెలుపునకు సహకరిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని.. ముఖ్యంగా పెన్షన్లు, రైతుబీమా, రైతుబంధు, కులవృత్తులకు పెద్దపీట, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలతో ఆయా గ్రామాల్లో లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి ప్రచారం చేపట్టాలని నేతలు ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top