చండీగఢ్‌లో త్రిముఖ పోటీ

Triangular fighting in Chandigarh - Sakshi

రెండోసారి ఎన్నికల బరిలో కిరణ్‌ ఖేర్‌

కాంగ్రెస్‌ అభ్యర్థి బన్సాల్‌పై ఆమె విమర్శల వర్షం

గతంలో ఆమె అనుచరుడే నేడు ప్రత్యర్థి

పంజాబ్, హరియాణా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి చివరిదశలో మే 19న పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రసిద్ధ నటుడు అనుపమ్‌ ఖేర్‌ భార్య, ప్రముఖ నటి, టీవీలో ప్రముఖ సంగీత కార్యక్రమాలెన్నింటికో వ్యాఖ్యాతగా ఉన్న కిరణ్‌ ఖేర్‌ ఈసారి కూడా తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. నాలుగుసార్లు లోక్‌సభకి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ అభ్యర్థి వపన్‌ కుమార్‌ బన్సాల్‌పై కిరణ్‌ ఖేర్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

చండీగఢ్‌ లోక్‌సభ స్థానాన్ని మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి బన్సాల్‌ 1991, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు. 2014లో కిరణ్‌ ఖేర్‌ 42.2 శాతం ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 1996లో బీజేపీ నుంచి సత్యపాల్‌ జైన్‌ ఈ స్థానంలో గెలిచారు. ఈసారి మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్, బీజేపీలకు తోడు గత ఎన్నికల్లో కిరణ్‌ ఖేర్‌ గెలుపుకోసం కీలకంగా పనిచేసిన హర్‌మోహన్‌ ధవన్‌ ఈసారి ఆమ్‌ ఆద్మీ తరఫున పోటీచేస్తున్నారు. హర్‌మోహన్‌ ధవన్‌ ఈసారి ఓట్లు చీలుస్తారనే భయంలో కాంగ్రెస్‌ ఉంది. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకన్నా ఆప్‌ అభ్యర్థిపైనే ఆశలు పెట్టుకున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.  

అయితే నాలుగు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి బన్సాల్‌ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీలేదని బీజేపీ విమర్శిస్తోంది. స్వచ్ఛత, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్‌ వల్ల ఒరిగిందేమీ లేదని కిరణ్‌ ఖేర్‌ ఆరోపణ. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి బన్సాల్‌ మాత్రం ప్లాన్డ్‌ సిటీ అయిన చండీగఢ్‌ని స్వచ్ఛత ర్యాంకింగ్‌లో 3వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజార్చిన ఘనత బీజేపీదేనని తిరుగుదాడి చేస్తున్నారు. ఐదేళ్ల నా పాలన చూడండి, 15 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని పోల్చుకుని ఓటెయ్యండని కిరణ్‌ ఖేర్‌ ప్రజల్లోకి వెళుతున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు రాబోయే ఐదేళ్ళ ఎజెండాని ముందుగానే ప్రకటించిన కిరణ్‌ ఖేర్‌ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తాననీ, సోలార్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తాననీ అంటున్నారు. చండీగఢ్‌ని సిలికాన్‌ వ్యాలీప్రమాణంగా పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తానంటోన్న కిరణ్‌ఖేర్‌ ఈసారి గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు ఈ మూడు పార్టీల్లో ఎవరిని ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top