ఠాక్రే నామ సంవత్సరం!

Thackeray's Family dream comes true, Uddhav As a Maharashtra CM - Sakshi

ఠాక్రే కుటుంబంలో చిరస్థాయిగా నిలిచిపోనున్న 2019వ సంవత్సరం 

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మహారాష్ట్ర అధికార పీఠమెక్కిన ఉద్ధవ్‌ ఠాక్రే 

ఠాక్రే కుటుంబ దశాబ్ధాల రాజకీయ జీవితంలో మొట్టమొదటి సీఎంగా ఉద్ధవ్‌ 

సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాల్లో 2019వ సంవత్సరంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పెను మార్పులు సంభవించాయి. కాషాయ కూటమిగా పోటీచేసిన శివసేన, బీజేపీలు ఫలితాల అనంతరం విడిపోయాయి. అప్పటివరకూ ప్రత్యర్థులుగా ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహావికాస్‌ ఆఘాడిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఠాక్రే కుటుంబంలో మొట్టమొదటిసారిగా శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్‌ ఠాక్రే కుమారుడు, ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి కావడం, బాల్‌ ఠాక్రే మనవడు, ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు కేబినేట్‌ మంత్రి కావడంలాంటి ఊహించని సంఘటనలతో ఈ సంవత్సరం ఠాక్రే నామ సంవత్సరంగా గుర్తుండిపోయింది.  

కలసి.. విడిపోయి 
ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్‌లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి. దీంతో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. 

అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందం మేరకు రెండున్నరేళ్లపాటు శివసేనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని శివసేన డిమాండు చేసింది. కాని అలాంటి ఒప్పందమేమి జరగలేదని బీజేపీ పేర్కొనడంతో వీరిమద్య విబేదాలు ఏర్పడ్డాయి. ఇలా ఈ అంశంపై దూరంపెరిగిన చివరికి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. దీంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో మహారాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతి పాలనను కూడా విధించారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అన్ని ఒప్పందాలు కుదిరాయి. 

కానీ, ఊహించని విధంగా ఒప్పందం కుదిరిన మరుసటి రోజున ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతు పలికారు. ఊహించని విదంగా నవంబర్‌ 23వ తేదీ ఉదయం 8 గంటలకే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని ట్విస్ట్‌తో ఒక్కసారిగా అందరు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చల్లోకెక్కింది.  

నవంబర్‌ 28న పట్టం.. 
రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌ పవార్‌ అజిత్‌ పవార్‌ను రాజీనామా చేయించడంతోపాటు ఆయనతో వెళ్లిన వారందరిని తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహాకూటమి ఆఘాడి ప్రభుత్వం నవంబర్‌ 28న కొలువదీరింది. శివసేన అధినేత దివంగత బాల్‌ ఠాక్రే కుమారుడు శివసేన అధ్యక్షులు ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా ఆరుగురు మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఎట్టకేలకు నెలరోజుల తర్వాత మళ్లీ పూర్తిస్థాయి మంత్రులతో కొలువుదీరింది. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రి కావడంతోపాటు ఆదిత్య ఠాక్రే కేబినేట్‌ మంత్రిగా మారారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా తండ్రి ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా కుమారుడు ఆదిత్య ఠాక్రే కేబినేట్‌ మంత్రిగా మారారు. మరోవైపు బీజేపీ ఈ ఊహించని షాక్‌లతో ఖంగుతింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top