ఆశావహులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు!

Telangana congress preparing candidates list those who not get tickets - Sakshi

పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్న వారిని మెప్పించే పనిలో అధిష్టానం

రెండో స్థానంలోని నేతల పేర్లతో జాబితాకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: చివరి నిమిషం వరకు టికెట్‌ రేసులో ఉండి అదృష్టం దక్కని నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీకి పిలిపించి బుజ్జగించాల్సిన నేతల జాబితాను తయారు చేసే బాధ్యత రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించింది.

ఇతర పార్టీలతో పొత్తుల్లో భాగంగా కోల్పోతున్న సీట్లు, సామాజిక వర్గాల వారీ సమీకరణలు, ఇతర కారణాలతో టికెట్లు పొందలేకపోతున్న వారిలో ముఖ్యులను గుర్తించాలని, టికెట్‌ వచ్చిన నాయకుడి తర్వాతి స్థానంలో ఉండే వారందరి పేర్ల జాబితా తయారు చేయాలని సోమవారం పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అధిష్టానం పిలిపించాల్సిన నేతలతో సమన్వయం చేసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాట్లు చూసుకునే బాధ్యతను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది.

20 మందికి పైగా..
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకుగాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నా రు. అయితే, పొత్తుల్లో భాగంగా దాదాపు 25 సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి రావడం.. కొన్ని చోట్ల ముగ్గురు, నలుగురు నుంచి ఒక్కరిని ఎంపిక చేయా ల్సి రావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న దాదాపు 20 మందికి పైగా నేతలు అవకాశం కోల్పోనున్నారు.

వీరందరినీ రెం డ్రోజుల్లో ఢిల్లీకి పిలిపించాలని, నామినేషన్ల కంటే ముందే వారి అసంతృప్తిని చల్లార్చి రెబెల్‌గా బరిలో దిగకుండా పార్టీ అభ్యర్థికి సహకరించేలా ఒప్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యంగా పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇచ్చే స్థానాల్లో అవకాశం ఇవ్వలేని వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వనుంది.

ఎమ్మెల్సీగా లేదంటే మరో రకంగా అవకాశం ఇస్తామ ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేతలు టీపీసీసీ చీఫ్‌ సమక్షంలో హామీ ఇవ్వనున్నారు. వీరితో పాటు ఇతర కారణాలతో పార్టీ టికెట్‌ దక్కని ముఖ్యులకు కూడా కచ్చితమైన భరోసా కల్పించనున్నారు. ఇతర పార్టీలతో పొత్తు అనివార్యత, ఎలాంటి పరిస్థితులలో వారికి టికెట్‌ ఇవ్వలేకపోయామో వివరించి భవిష్యత్తులో ఇచ్చే ప్రాధాన్యంపై వార్‌రూమ్‌లోనే హామీలు ఇవ్వనున్నట్టు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top