కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది

Telangana Congress Leaders fire on CM KCR - Sakshi

ఆయనకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి

హైకోర్టు తీర్పు టీఆర్‌ఎస్‌ సర్కారుకు చెంపపెట్టు

కాంగ్రెస్‌ నేతల మండిపాటు

సాక్షి, హైదరాబాద్ ‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లపై వేసిన అనర్హత వేటును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ పార్టీ స్వాగతించింది. హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అన్యాయంగా తమ సభ్యులపై వేటు వేశారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ మంగళవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

వందమంది కేసీఆర్‌లు వచ్చినా నన్నేమీ చేయలేరు!
కేసీఆర్‌ నెలరోజులుగా మానసికంగా నన్ను ఇబ్బందులు పెట్టారు. నా అనుచరుడిని కూడా హత్య చేశారు.  న్యాయస్థానాలు నాకు రక్షణగా నిలిచాయి. కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. కేసీఆర్‌ డ్రామా ఆడి పైశాచిక ఆనందం పొందాడు. చేయని తప్పుకు నాతో పాటు దళిత శాసన సభ్యుడు సంపత్‌పై అనర్హత వేటు వేశారు. నా అనుచరుడిని హత్య చేసిన విషయం కాల్ డేటాలో పట్టుపడిన విషయం నిజం కాదా? పైన దేవుడు ఉన్నంతవరకు 100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. కేసీఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలి.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

కేసీఆర్‌ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లపై విధించిన బహిష్కరణ వేటును  కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఇది ఈ నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజలను, ప్రశ్నించే గొంతులను నులిమివేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుంది. ప్రజల మద్దతుతో ముందుకు పోతుంది. ఎప్పటికైనా గెలుపు మాదే. అధికార దూరహంకారంతో, విచ్చలవిడి చేష్టలతో విర్రవీగిపోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి.
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌

కేసీఆర్‌కు ఈ తీర్పు చెంపపెట్టు
హైకోర్టు తీర్పుతో టీఆర్‌ఎస్‌ సిగ్గుపడాలి. ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది టీఆర్‌ఎస్‌ దిగజారుడు నిర్ణయం.  కేసీఆర్‌కు ఒక్కరోజు కూడా  సీఎంగా కొనసాగేహక్కు లేదు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గు రావటం లేదు. దేశం సిగ్గుపడేలా ప్రభుత్వం వ్యవహరించింది. సీఎం కేసీఆర్‌కు ఈ తీర్పు చెంపపెట్టు. సీఎం ఎన్నికలకు సిద్ధం అంటున్నారు. పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామా చేయించాలి. ప్రభుత్వానికి దమ్ము ఉంటే శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్దాం. కోర్టు తీర్పును కూడా స్పీకర్ అమలు చేయకుంటే ప్రజలు అసలు తీర్పు ఇస్తారు. సీఎం కుర్చీకి నామినేషన్ ప్రక్రియ లేదు.. ఉంటే కనుక 20 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండేలా నామినేట్ చేసుకునే వాడు.
-డీకే అరుణ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top